AMAZON: బెంగళూరు వాసులు తెగ కొనేస్తున్నారట...!
దేశంలో గణనీయంగా పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్... అమెజాన్‌లో అత్యధిక సమయం గడిపే నగరంగా బెంగళూరు...;
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, టాటా, రిలయన్స్ వంటి షాపింగ్ యాప్‌లలో ఎక్కువ సమయం గడిపే ప్రజలు ఉన్న నగరం ఏమై ఉంటుంది. ఢిల్లీ, ముంబై అని అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అమెజాన్‌లో అత్యధిక సమయం గడిపే నగరంగా బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. దేశ రాజధాని, ఆర్థిక రాజధానులను వెనక్కి నెట్టి బెంగళూరు ఫస్ట్ ప్లేస్ సాధించిందని సైబర్‌మీడియా రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరు ప్రజలు అమెజాన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. గౌహతీ, కోయంబత్తూర్ లక్నో వంటి టైర్ II నగరాలు కూడా ఆన్‌లైన్ షాపింగ్‌లో మునిగిపోతున్నాయని తెలిపింది. అమెజాన్‌లో బెంగళూరు ప్రజలు వారానికి సగటున 4 గంటల రెండు నిమిషాలు గడుపుతున్నారని సైబర్ మీడియా రిసెర్చ్ తెలిపింది. ఈ అధ్యయనం టైర్ 1, టైర్ 2 నగరాల్లో ఆన్‌లైన్ షాపింగ్ అలవాట్లపై దృష్టి సారించింది, బెంగళూరు ప్రజలు ఈ కామర్స్‌లో అత్యధిక సమయాన్ని వెచ్చిస్తున్నారని ఇది మరింత పెరగనుందని తెలిపింది.
గౌహతి, కోయంబత్తూర్, లక్నో వంటి టైర్ II నగరాల ప్రజలు కూడా వారానికి సగటున 2 గంటల 25 నిమిషాలు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తారు. టైర్ 2 నగరాల ప్రజలు తమ ఆదాయంలో దాదాపు 16 శాతాన్ని ఆన్‌లైన్ షాపింగ్‌ల కోసం ఖర్చు పెడుతున్నారని వెల్లడించింది. ఆన్‌లైన్ షాపింగ్ వైపు ప్రజలు మక్కువ చూపుతుండడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. అయితే అమెజాన్ వినియోగదారుల విశ్వాసాన్ని పొందిందని.. భారత్‌లో అత్యధికుల తొలి ఎంపిక ఇదేనని కూడా ఈ అధ్యయనం తెలిపింది. టైర్ II, టైర్ I నగరాల్లో 73 శాతం మంది వినియోగదారులు గత ఆరు నెలల్లో అమెజాన్‌లో షాపింగ్ చేశారని అధ్యయనం తెలిపింది. తర్వాతి స్థానాల్లో ఫ్లిప్‌కార్ట్ ఉంది.
మహిళా పారిశ్రామికవేత్తలు సంవత్సరానికి సగటున 149 గంటల సమయాన్ని ఈ-కామర్స్‌పై వెచ్చిస్తున్నారు. వీరిలో 29 శాతం మంది ఆన్‌లైన్‌లో 15,000 నుంచి 20 వేల ధరల శ్రేణిలో స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. మిలీనియల్స్( 1981-1996 మధ్య పుట్టినవారు)తో పోలిస్తే జెన్ జెడ్ (1990-2000 మధ్య పుట్టినవారు) ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. టైర్ II నగరాల్లో గత ఆరు నెలల్లో సగటు ఆన్‌లైన్ ఖర్చు రూ. 20,100 కాగా.. టైర్ I కొనుగోలుదారులు రూ. 21,700 ఖర్చు చేశారు. ముంబైలో అత్యధిక సగటు ఖర్చు రూ. 24,200 కాగా.. నాగ్‌పూర్, కోయంబత్తూర్ ప్రజలు సగటున రూ. 21,600 ఖర్చు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల ఆన్‌లైన్ కొనుగోళ్లలో 81 శాతంతో నాగ్‌పూర్ అగ్రగామిగా ఉంది. ఆన్‌లైన్ కొనుగోలులో స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.