Toyota Fortuner : ఫార్చ్యూనర్ అభిమానులకు పండుగ.. టయోటా లీడర్ ఎడిషన్ వచ్చేసింది.
Toyota Fortuner : భారీ ఎస్‌యూవీ కార్లలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టయోటా ఫార్చ్యూనర్ ఇప్పుడు కొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ కొత్త 2025 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌ను మరింత స్టైలింగ్, సరికొత్త ఫీచర్లతో విడుదల చేసింది. ఈ ప్రత్యేక మోడల్ బుకింగ్‌లు అక్టోబర్ 2025 రెండవ వారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా లేదా టయోటా డీలర్‌షిప్‌లలో ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ కొత్త లీడర్ ఎడిషన్ ప్రత్యేకమైన కస్టమైజ్డ్ ఫైనాన్స్ సౌకర్యంతో కూడా లభిస్తుంది. దీని కింద ఈఎంఐతో 8 సంవత్సరాల వరకు ఫండింగ్ పథకాలు, టయోటా స్మార్ట్ బెలూన్ ఫైనాన్స్, మెరుగైన వారంటీ కూడా లభిస్తుంది. దీంతో పాటు ఐదేళ్ల కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 సంవత్సరాలు / 1,00,000 కి.మీ. వారంటీ ఉంటుంది. దీనిని 5 సంవత్సరాలు / 2,20,000 కి.మీ. వరకు పొడిగించుకునే అవకాశం, టయోటా స్మైల్స్ ప్లస్ సర్వీస్ ప్యాకేజీని కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు.
2025 టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ నాలుగు కలర్ ఆప్షన్స్ లలో లభిస్తుంది. ముత్యపు తెలుపు, నలుపు, సిల్వర్, సుపీరియర్ తెలుపు. ఈ కారుకు కొత్త డిజైన్ గ్రిల్, ముందు, వెనుక బంపర్ స్పాయిలర్లు, క్రోమ్ గార్నిష్ జోడించారు. ముఖ్యంగా, నలుపు రంగులో ఉన్న డ్యూయల్-టోన్ రూఫ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఒక స్పెషల్ ఎంబ్లమ్ దీని స్పోర్టీ లుక్‌ను మరింత పెంచుతాయి.
కారు లోపలి భాగంలో కొత్త ఫార్చ్యూనర్ లీడర్ వేరియంట్‌లో బ్లాక్ మెరూన్ రంగులతో కూడిన డ్యూయల్-టోన్ సీట్లు, డోర్ ట్రిమ్‌లు ఉన్నాయి. వీటితో పాటు, ఆటోమేటిక్ ఫోల్డింగ్ మిర్రర్స్, బ్రైట్ స్కాఫ్ ప్లేట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అందించారు.
ఇంజిన్ విషయానికొస్తే ఈ కొత్త ఎడిషన్‌లో వీజీటీతో కూడిన 2.8 లీటర్ టర్బో ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 201 బీహెచ్‌పీ పవర్, 500 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ RWD (రియర్-వీల్ డ్రైవ్) 4X2 కాన్ఫిగరేషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.