TRUMP: భారత్‌పై ట్రంప్ కామెంట్లు.. మళ్లీ దుమారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి జీరో టారిఫ్‌ల విషయాన్ని ప్రస్తావన;
వాషింగ్టన్–న్యూఢిల్లీ వాణిజ్య సంబంధాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి జీరో టారిఫ్‌ల విషయాన్ని ప్రస్తావించారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత్ అంగీకరించిందని స్పష్టం చేశారు. అమెరికాలో ప్రసారమయ్యే ఫాక్స్ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, “భారత్ ప్రపంచంలో అత్యధిక దిగుమతి సుంకాలు వసూలు చేసే దేశాల్లో ఒకటి” అని విమర్శించారు.
వాణిజ్య ఒప్పందంపై చర్చలు
భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరే విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. "ఇకపై భారత ప్రభుత్వం అమెరికా దిగుమతులపై 100 శాతం టారిఫ్ తగ్గించనుంది. మేము చెప్పిన విధంగా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు దేశాలు వేచి చూస్తున్నాయి," అని పేర్కొన్నారు.
ప్రత్యుత్తరంగా జైశంకర్ స్పందన
ఇదిలాఉండగా, ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పరోక్షంగా స్పందించారు. “భారత్–అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇవి సంక్లిష్ట చర్చలు. ప్రతీ అంశంపై సమగ్రంగా నిర్ణయించాకే తుది ఒప్పందం కుదురుతుంది. పరస్పర ప్రయోజనాలపై దృష్టి సారించిన ఒప్పందమే మాకు అవసరం,” అని వ్యాఖ్యానించారు.
స్పష్టత వచ్చే వరకు అనౌన్స్‌మెంట్ అవసరం లేదు
టారిఫ్‌లు, దిగుమతి విధానాల విషయంలో తేలికగా ప్రకటనలు చేయడం కంటే పరస్పర అంగీకారంతోనే నిర్ణయం తీసుకోవాలన్నది భారత్ వైఖరి. అంతర్జాతీయ వేదికలపై ట్రంప్ తరచూ చేస్తోన్న వ్యాఖ్యలు వాణిజ్య చర్చలపై ప్రభావం చూపవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.
వలసదారులపై తీవ్రంగా స్పందించిన ట్రంప్
వలసదారుల బహిష్కరణ కేసులో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వెనెజులాకు చెందిన గ్యాంగ్‌ను బహిష్కరించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుతగలడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ''మన దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చిన వారిని బలవంతంగా పంపడాన్ని అనుమతించమని సుప్రీంకోర్టు ఇప్పుడే తీర్పునిచ్చింది. వారిలో అనేకమంది హంతకులు, మాదకద్రవ్యాల వ్యాపారులు, నేరస్థులు ఉన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో వారిని చట్టబద్ధంగా దేశం నుంచి పంపించేందుకు చాలా సంవత్సరాలు పడుతోంది.” అని అన్నారు.