TVS Apache Sales : టీవీఎస్ అపాచీ దూకుడు.. ఈ దశాబ్దపు రికార్డు వైపు పయనం.
TVS Apache Sales : టీవీఎస్ మోటార్ కంపెనీకి ఆర్థిక సంవత్సరం 2026 చాలా బలంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో (ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) కంపెనీ మొత్తం 27.9 లక్షల టూ-వీలర్ యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 15% అధికం. ఈ వృద్ధిలో టీవీఎస్ మోటార్‌సైకిల్ అమ్మకాలదే ముఖ్య భూమిక. ఈ 8 నెలల కాలంలో టీవీఎస్ ఒంటరిగా 9,69,092 మోటార్‌సైకిళ్లను అమ్మింది, ఇది 11% వార్షిక వృద్ధిని సూచిస్తుంది. ఈ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం 150-200cc విభాగంలో టీవీఎస్ అపాచీ సిరీస్‌కు ఉన్న బలమైన డిమాండ్.
టీవీఎస్ అపాచీ బ్రాండ్‌లో RTR 160, RTR 160 4V, RTR 180, RTR 200 వంటి నాలుగు ప్రధాన మోడల్స్ ఉన్నాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ 2025 మధ్య కాలంలో ఈ అపాచీ బైక్‌ల మొత్తం అమ్మకాలు 3,82,431 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 24% ఎక్కువ. అపాచీ లైన్-అప్‌లో RTR 310, RR 310 వంటి పెద్ద మోడల్స్, ఇటీవల లాంచ్ అయిన RTX 300 అడ్వెంచర్ బైక్ కూడా ఉన్నాయి. అపాచీ బ్రాండ్ డిసెంబర్ 2025లో తన 20 ఏళ్ల ప్రయాణంలో మూడోసారి 4 లక్షల యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాల మైలురాయిని చేరుకోనుంది. 150-200cc సెగ్మెంట్‌లో టీవీఎస్ అపాచీ స్థానం చాలా బలంగా ఉంది. ఈ విభాగంలో టీవీఎస్, బజాజ్, హోండా, హీరో మోటోకార్ప్ బైక్‌లు బలమైన రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్నాయి.
2026 ఆర్థిక సంవత్సరం రాబోయే నెలల్లో టూ-వీలర్ మార్కెట్ దృక్పథం సానుకూలంగా ఉంటుందని FADA నివేదిక అంచనా వేసింది. 74% డీలర్లు వృద్ధిని ఆశిస్తున్నారు. జీఎస్టీ 2.0 రేట్ల తగ్గింపు, డీలర్ ఆఫర్‌లు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో టూ-వీలర్‌లకు డిమాండ్ పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అపాచీ బైక్‌ల ధరలు RTR 160 2V కోసం రూ.1,01,890 నుంచి మొదలవుతాయి. టాప్ మోడల్ RTR 200 4V ధర రూ.1,41,990 వరకు ఉంది. ఈ అపాచీ 150-200cc సిరీస్ బైక్‌లకు విదేశీ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. గత 8 నెలల్లో 97,767 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.. ఇది 32% అధికం.