TVS Ntorq 125 vs Hero Xoom 125 : టీవీఎస్ ఎన్‌టార్క్ vs హీరో జూమ్ 125.. వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న స్పోర్టీ స్కూటర్లు.
నేటి యువతకు స్కూటర్ అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది వారి స్టైల్ స్టేట్‌మెంట్ కూడా. అందుకే మార్కెట్లో 125 సిసి స్పోర్టీ స్కూటర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సెగ్మెంట్లో రారాజుగా వెలుగొందుతున్న టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS Ntorq 125)కు పోటీగా, దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన జూమ్ 125 (Hero Xoom 125)ను రంగంలోకి దింపింది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏ స్కూటర్ కొంటే మీ పైసా వసూల్ అవుతుంది? ఈ వివరాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకుందాం.
డిజైన్, లుక్స్
డిజైన్ విషయానికి వస్తే, టీవీఎస్ ఎన్‌టార్క్ ఒక యుద్ధ విమానం (Stealth Aircraft) స్ఫూర్తితో రూపొందించబడింది. దీని బాడీ కట్స్, టీ-షేప్ ఎల్ఈడీ టెయిల్ లైట్, అగ్రెసివ్ హెడ్ లాంప్, స్పోర్టీ ఎగ్జాస్ట్ సౌండ్ కుర్రాళ్లను ఫిదా చేస్తాయి. ముఖ్యంగా ఇందులోని గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్లు చాలా రిచ్‌గా ఉంటాయి.
మరోవైపు, హీరో జూమ్ 125 చాలా షార్ప్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. ఇది ఎన్‌టార్క్ కంటే కొంచెం పొడవుగా ఉండటమే కాకుండా, పెద్ద టైర్ల వల్ల మంచి రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంది. అయితే, రంగుల విషయంలో హీరో కొంచెం వెనకబడిందనే చెప్పాలి. ప్రస్తుతం ఇది ఎల్లో, గ్రే, రెడ్, బ్లూ రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీకు ప్యూర్ స్పోర్టీ లుక్ కావాలంటే ఎన్‌టార్క్, కాస్త క్లాసీగా ఉండే స్పోర్టీ లుక్ కావాలంటే జూమ్ వైపు మొగ్గు చూపవచ్చు.
ఇంజిన్, పర్ఫార్మెన్స్
ఎన్‌టార్క్‌లో 124.8 సిసి, 3-వాల్వ్ ఇంజిన్ ఉంది. ఇది 9.5 bhp పవర్, 10.6 Nm టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 95-100 కిలోమీటర్లు. కేవలం 7.9 సెకన్లలోనే 0-60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇక హీరో జూమ్ 125 విషయానికి వస్తే ఇందులో 125 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 9 bhp పవర్, 10.4 Nm టార్క్ ఇస్తుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పవర్ కొంచెం తక్కువైనా జూమ్ కేవలం 7.6 సెకన్లలోనే 0-60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అంటే సిటీ ట్రాఫిక్‌లో దూసుకుపోవడానికి జూమ్ చాలా క్విక్‌గా ఉంటుంది. కానీ హైవే మీద లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు ఎన్‌టార్క్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది.
కంఫర్ట్, కొలతలు
హీరో జూమ్ 125 అన్ని విధాలా ఎన్‌టార్క్ కంటే కొంచెం పెద్దది. జూమ్ పొడవు 1978 మిమీ ఉండగా, ఎన్‌టార్క్ 1865 మిమీ మాత్రమే ఉంది. అలాగే జూమ్ గ్రౌండ్ క్లియరెన్స్ (164 మిమీ) ఎక్కువగా ఉండటం వల్ల మన ఊర్లలోని గుంతలు, స్పీడ్ బ్రేకర్లను ఈజీగా దాటేస్తుంది. ఎన్‌టార్క్ బరువు 111 కేజీలు కాగా, జూమ్ 121 కేజీల బరువు ఉంటుంది. సీటు ఎత్తు విషయానికి వస్తే, ఎన్‌టార్క్ (770 మిమీ) కొంచెం తక్కువగా ఉండటం వల్ల తక్కువ ఎత్తు ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
మెకానికల్ ఫీచర్లు
ఈ రెండు స్కూటర్లలో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, డిస్క్ బ్రేకులు ఉన్నాయి. కానీ చక్రాల విషయానికి వస్తే పెద్ద మార్పు కనిపిస్తుంది. ఎన్‌టార్క్‌లో 12-అంగుళాల చక్రాలు ఉంటే, హీరో జూమ్ 125 లో 14-అంగుళాల పెద్ద చక్రాలు ఉన్నాయి. పెద్ద చక్రాల వల్ల జూమ్ రైడింగ్ చాలా స్టేబుల్‌గా ఉంటుంది, ముఖ్యంగా మూలల్లో తిరిగేటప్పుడు (Cornering) మంచి గ్రిప్ ఇస్తుంది. ఇక ఎన్‌టార్క్ హ్యాండ్లింగ్ చాలా షార్ప్‌గా ఉండి, జిగ్‌జాగ్‌గా వెళ్లడానికి బాగుంటుంది.