అమెరికాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం - ప్రపంచస్థాయి ప్రాంగణ నిర్మాణం

చరిత్రలో తొలిసారిగా భారతీయులచే 2016లో స్థాపించబడి, ప్రతిష్టాత్మకమైన WASC SCUC (Senior College and University Commission) గుర్తింపు సాధించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం

Update: 2021-09-17 09:47 GMT

అమెరికా: ప్రవాస భారతీయుల చరిత్రలో తొలిసారిగా భారతీయులచే 2016లో స్థాపించబడి, ప్రతిష్టాత్మకమైన WASC SCUC (Senior College and University Commission) గుర్తింపు సాధించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం (University of Silicon Andhra) శాన్ వాకిన్ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణ సమీపంలో ప్రపంచస్థాయి విద్యాప్రాంగణ నిర్మాణానికి తలపెట్టింది.

ఈ ప్రాంగణ నిర్మాణానికి ఎంతో విలువైన 67 ఎకరాల భూమిని ఇవ్వటానికి సంధు కుటుంబం దాతగా ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిపొందిన సిలికాన్ వ్యాలీకి సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం రూపుదిద్దుకోనుంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా శాన్ వాకిన్ జిల్లా యువత అనేక రకాలుగా లబ్ధి పొందుతారని సంధు కుటుంబసభ్యులు మైక్ సంధు, మణి సంధు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ...అందరి మన్నలను, సహకారాన్ని పొందిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్థానికంగా, దేశవ్యాప్తంగా విభిన్న రంగాల అభివృద్ధికై సముచితమైన విద్యాబోధనను అందిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే అట్టడుగు వర్గాల అభివృద్ధికి తోడ్పడుతూ స్పష్టమైన ప్రణాళికతో ఉన్నతస్థాయిలో పరిశోధనాత్మకమైన విద్యను అందించే దిశగా విశ్వవిద్యాలయం పథకాలను అవలంబిస్తుందని అన్నారు.

రాబోయే 5 సంవత్సరాల కాలంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఈ ప్రాంగణ నిర్మాణం సింహభాగాన్ని పూర్తిచేయాలన్న తలంపుతో ఉన్నది. ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణ నిర్మాణానికి సుమారుగా 450 మిలియన్ డాలర్ల (రూ.3300 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా. దాతల సహకారంతో ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం రూపుదిద్దుకోనుంది.

ప్రొవోస్ట్ చమర్తి రాజు మాట్లాడుతూ శాన్ వాకిన్ జిల్లా సామాజిక, ఆర్థిక అభివృద్ధికై సహయపడే విద్యాప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, భాషాశాస్త్రాలు, యోగ, ఆయుర్వేద, సంగీత నృత్య కళలలో BS/MS/MA మరియు Ph.D. డిగ్రీలను అందించే అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయంగా రూపొందబోతోందని తెలిపారు.

ఉన్నతవిద్యను అందించే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం శాన్ వాకిన్ జిల్లా ప్రాంతానికి రావటం పట్ల ప్రభుత్వ అధికారులు, స్థానిక పాలకులు హర్షం వ్యక్తం చేశారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివరాలు https://www.uofsa.edu వెబ్ సైటులో లభ్యమవుతాయి అని విశ్వవిద్యాలయం టెక్నాలజీ డైరెక్టర్ ఫణి మాధవ్ కస్తూరి తెలిపారు.

Tags:    

Similar News