UPI: ఆగస్టు 1 నుంచి యూపీఐలో కొత్త మార్పులు
UPIలో రోజుకి 50 సార్లు బ్యాలెన్స్ చెక్‌కు లిమిట్.. NPCI కొత్త మార్గదర్శకాలు విడుదల;
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో విస్తృతంగా వినియోగంలో ఉన్న యూపీఐ (UPI) చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక మార్పులు తీసుకొస్తోంది. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా బ్యాలెన్స్ చెక్, ఆటో డెబిట్ లావాదేవీల్లో మార్పులు జరగనున్నాయి. నెట్‌వర్క్‌పై భారం తగ్గిస్తూ వినియోగదారులకు నిరవధికంగా వేగవంతమైన సేవలు అందించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం.
రోజుకు 50 సార్లకు పరిమితమయ్యే బ్యాలెన్స్ చెక్
ప్రస్తుతం యూజర్లు యాప్ ద్వారా ఎన్ని సార్లైనా బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకునే వీలు ఉంది. అయితే ఈ విధానమే యూపీఐ సర్వర్లపై అధిక భారం కలిగించడంతో, దాన్ని నియంత్రించేందుకు *NPCI* తాజా పరిమితులను విధించింది. ఇకపై రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయడానికి అనుమతి ఉంటుంది. ఒక్క మొబైల్ నంబర్‌కు లింక్ అయిన ఖాతాల వివరాలను 25 సార్లు మాత్రమే చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిమితి యాప్‌ల్లో (Google Pay, PhonePe, Paytm) API కాల్స్ పరిమితీకరణకు దోహదపడనుంది.
ఆటోపేమెంట్‌కు 'నాన్ పీక్ అవర్స్' షెడ్యూల్ తప్పనిసరి
ఆటో డెబిట్ (Auto Debit) లేదా ఆటోపేమెంట్ వ్యవస్థలు – సబ్‌స్క్రిప్షన్, ఈఎంఐ, బిల్లుల చెల్లింపులు వంటి సేవల్లో విస్తృతంగా వాడతారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే పీక్ అవర్స్ (ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు) కాకుండా. ఆటోపేమెంట్ రిక్వెస్ట్‌లు నాన్‌పీక్ టైమ్‌లో షెడ్యూల్ చేయాలి. చెల్లింపు సంస్థలకే ఈ నిబంధన వర్తించనుండగా, యూజర్ ఇచ్చే చెల్లింపులపై ఈ నిబంధన వర్తించదు.
ఎందుకు తీసుకొచ్చారు ఈ మార్పులు?
ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో (జనవరి–జూన్) యూపీఐ సేవలకు సంబంధించి కొన్ని సార్లు అంతరాయాలు ఏర్పడ్డాయి. వాటికి ప్రధానంగా కారణంగా:
అనవసర API కాల్స్ (బ్యాలెన్స్ చెక్, పేమెంట్ స్టేటస్ రిక్వెస్ట్‌లు)
ఆటోమెటెడ్ ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్‌లు
స్పామ్/బాట్ ఆధారిత యాక్టివిటీలు
ఇవి యూపీఐ నెట్‌వర్క్‌ను మితిమీరిన స్థాయిలో ఒత్తిడికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో నెట్‌వర్క్ సరళత, వేగం పెంచేందుకు NPCI ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
వినియోగదారులపై ప్రభావం ఎంత?
ఈ మార్పుల వల్ల సాధారణ వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఓ సాధారణ యూజర్ రోజుకు 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసే అవకాశం చాలా తక్కువ. ఆటోపేమెంట్ లావాదేవీలు యాప్ సంస్థల మార్గదర్శకాల మేరకు నడుస్తుండటంతో వినియోగదారుడికి తేడా తెలియకపోవచ్చు. అత్యధికంగా API ఆధారిత సేవలు ఉపయోగించే బిజినెస్ యూజర్లకే ఈ మార్పులు ముఖ్యంగా వర్తిస్తాయి.