అమెరికా ఎలక్షన్స్ 2020 ఫలితం కోసం దేశీయ ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఓటు లెక్కింపు జరుగుతోంది. ఫలితం ఇంకా ప్రకటించలేదు. జో బిడెన్ విజయానికి దగ్గరగా ఉన్నట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి. బైడెన్ గెలిస్తే భారతీయ మార్కెట్లకు అనుకూలంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బైడెన్ గెలుస్తారన్న వార్తలు కూడా దేశీయ మార్కెట్లలో గత కొంతకాలంగా ర్యాలీకి కారణమయింది.
ముఖ్యంగా తన ఎజెండాలోని కార్పొరేట్ పన్ను రేటును 21 శాతం నుండి 28 శాతానికి పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా మార్కెట్లకు సానుకూలంగా మారుతుంది. పైగా ట్రంప్ తరహాలో వాణిజ్య యుద్ధాల ఉండకపోవచ్చు. ట్రంప్ వచ్చిన తర్వాత చాలా దేశాలతో వాణిజ్య యుద్ధాలకు తెరతీశాడు. ఇవి ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపాయి. చివరకు భారతదేశంతో కూడా పన్నుల విషయంలో మొండి వ్యవహరించిన గతాన్ని గుర్తుచేస్తున్నారు నిపుణులు. బైడెన్ గెలిచి మనదేశానికి అనుకూలంగా ఉండే వాణిజ్య విధానాలను అవలంభిస్తే.. భారతీయ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
ట్రంప్ కోవిడ్ తీవ్రత ఉన్నా లాక్ డౌన్ జోలికి పోలేదు. అదే సమయంలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. బైడెన్ గెలిస్తే లాక్ డౌన్ విధించినా.. ఉద్దీపన విషయంలో ఉదారంగా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనప్పటికీ ఇండియన్ మార్కెట్లలో ఇన్వెస్టర్లకు దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందని కూడా అంటున్నారు. దేశంతో మెరుగైన సంబంధాలే ఇందుకు కారణం.