Auto Sales : జీఎస్టీ 2.0 పుణ్యమా అని..ఇంటింటికీ కారు వచ్చేసింది..ఇక గల్లీల్లో ట్రాఫిక్ జామ్ తప్పదా?

Update: 2026-01-07 05:15 GMT

Auto Sales : గతేడాది ఆఖరి నెల డిసెంబర్ 2025లో భారత ఆటోమొబైల్ రంగం ఊహించని స్థాయిలో దూసుకుపోయింది. సాధారణంగా నగరాల్లో కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం, కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. పట్టణాల కంటే పల్లెటూళ్లు, చిన్న పట్టణాల్లోనే కార్ల కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన గణాంకాలు చూస్తుంటే, గ్రామీణ భారతంలో కార్ల క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థమవుతోంది.

గ్రామీణ మార్కెట్ హవా: డిసెంబర్ 2025లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాలు 26.64 శాతం పెరిగి 3,79,671 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఏకంగా 32.40 శాతం పెరగగా, పట్టణాల్లో ఇది 22.93 శాతానికే పరిమితమైంది. అంటే ఇప్పుడు విలాసవంతమైన కార్లు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, మారుమూల గ్రామాలకు కూడా చేరువవుతున్నాయని స్పష్టమవుతోంది.

జీఎస్టీ 2.0 మ్యాజిక్: ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం ప్రభుత్వం ప్రవేశపెట్టిన GST 2.0 సంస్కరణలేనని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త ట్యాక్స్ విధానం వల్ల చిన్న కార్లు, టూ వీలర్లు, కొన్ని కమర్షియల్ వాహనాల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా చిన్న కార్లపై జీఎస్టీని 28% నుంచి 18 శాతానికి తగ్గించడంతో మధ్యతరగతి ప్రజలు, చిన్న రైతులు కార్లు కొనేందుకు ఆసక్తి చూపారు. దీనికి తోడు రబీ సీజన్ సాగు బాగుండటం, ఆర్థిక వనరులు పెరగడం కూడా గ్రామీణ విక్రయాలకు కలిసొచ్చింది.

ప్రతి సెగ్మెంట్‌లోనూ జోరు: కేవలం కార్లే కాదు, ఆటోమొబైల్ రంగంలోని అన్ని విభాగాల్లోనూ గ్రోత్ కనిపించింది. డిసెంబర్‌లో కమర్షియల్ వాహనాల అమ్మకాలు 24.60 శాతం, త్రీ-వీలర్లు 36.10 శాతం, టూ-వీలర్లు 9.50 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2025 క్యాలెండర్ ఇయర్ మొత్తాన్ని పరిశీలిస్తే.. దేశంలో రికార్డు స్థాయిలో 2.81 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.71 శాతం ఎక్కువ.

సీఎన్జీ, ఈవీ హ్యాట్రిక్: పర్యావరణ హిత ఇంధనాల వైపు కూడా భారతీయులు మొగ్గు చూపుతున్నారు. 2025లో అమ్ముడైన మొత్తం కార్లలో CNG వాహనాల వాటా 21.30 శాతానికి చేరడం విశేషం. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా 4 శాతం మార్కును అందుకున్నాయి. ముఖ్యంగా టూ-వీలర్, త్రీ-వీలర్ విభాగాల్లో ఈవీల దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. 2026 ప్రారంభంలో కూడా ఇదే జోరు కొనసాగుతుందని, జనవరిలో సంక్రాంతి పండుగ, వివాహాల సీజన్ కారణంగా సేల్స్ మరింత పెరుగుతాయని డీలర్లు భావిస్తున్నారు.

Tags:    

Similar News