UPI : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలపై ఛార్జీలు విధించబడతాయా అనే విషయంపై చాలా కాలంగా ఉన్న అనుమానాలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెర దించారు. ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ, యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించాలనే ప్రతిపాదన ప్రస్తుతం ఆర్బీఐ ముందు లేదని స్పష్టం చేశారు. ఇది వినియోగదారులకు శుభవార్త అనే చెప్పాలి.
గతంలోనూ గవర్నర్, యూపీఐ ఎప్పటికీ ఉచితంగా ఉండదని తాను చెప్పలేదని, దీనికి ఖర్చులు ఉంటాయని, వాటిని ఎవరైనా భరించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. యూపీఐ సేవలు స్థిరంగా కొనసాగాలంటే, వాటి నిర్వహణ ఖర్చులను సమిష్టిగా లేదా వ్యక్తిగతంగా ఎవరైనా భరించాలి అని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం యూపీఐ లావాదేవీల ఖర్చులను సబ్సిడీ రూపంలో భరిస్తూ, వినియోగదారులకు ఉచితంగా సేవలు అందిస్తోంది.
లావాదేవీల పెరుగుదల యూపీఐ సర్వీసు ఉచితంగా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనికి సబ్సిడీ ఇస్తోందని గవర్నర్ వివరించారు. ఆగస్టు 2025లో యూపీఐ ద్వారా ఏకంగా 20 బిలియన్ (రెండు వేల కోట్లు) లావాదేవీలు జరిగాయని, ఇది ఒక సంవత్సరంలో 34 శాతం వృద్ధిని సూచిస్తుందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. ఈ భారీ వినియోగం, యూపీఐ స్థిరత్వంపై చర్చకు దారితీస్తోంది.