టాలీవుడ్ లో మరో క్లియరెన్స్ సేల్ కు ఈ ఫ్రైడే వేదిక కాబోతోంది. ఈ నెల 8న ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 సినిమాలు విడుదల కాబోతున్నాయి ఆ రోజు. మరి ఇన్ని సినిమాలు అంటే అన్నీ చిన్నవే అని.. ఎప్పుడో పూర్తయి.. విడుదల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నవే అని అర్థం కావడం లేదు. యస్.. ఈ 11 లో కాస్తో కూస్తో తెలిసినవి అంటే మూడు నాలుగు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా అన్నీ ఏ పేరూ లేని వారివే. అయినా థియేటర్స్ వరకూ వచ్చారంటే వారి కష్టం కనీసం చుట్టాలైనా చూస్తారేమో. ఇంతకీ ఆ 11 సినిమాలేంటీ అంటే..?
నిఖిల్ సిద్ధార్థ్, రుక్మిణి వసంత్ జంటగా సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒకటి ప్రధానంగా కనిపిస్తోంది. బట్ ఈ మూవీని వాళ్లెవరూ పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. అస్సలు ప్రమోషన్స్ లేవు. ఏదో ఒకటీ అరా ఇంటర్వ్యూస్ ఇచ్చారంతే. చాలా వరకూ ఇది డిజాస్టర్ మూవీ అనే అనుకుంటున్నారంతా. ట్రైలర్ చూశాక నిఖిల్ ఫ్యాన్స్ లో కూడా హోప్స్ పోయాయి.
పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ డైరెక్ట్ చేసిన జితేందర్ రెడ్డి కాస్త ఎక్కువ జనాలను ఆకట్టుకుంటోంది. ఇది ఒక వర్గానికి దన్నుగా నిలిచే కథలా కనిపిస్తోంది. దీనికి తోడు టికెట్ ధరలను భారీగా తగ్గించారు.
ఆపై ప్రమోషన్స్ తో ఎక్కువ హడావిడీ చేస్తున్న మూవీ ధూమ్ ధామ్. చేతన్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ మూవీలో సీనియర్ ఆర్టిస్ట్స్ ప్యాడింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. బట్ ట్రైలర్స్ లో చేతన్ ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ భయపెట్టలా ఉన్నాయి. హెబ్బా గ్లామర్, వెన్నెల కిశోర్ కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నారు వీళ్లు.
ఇక ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆదిపర్వం.. ఎర్రగుడి కథ అనే మూవీ కూడా ఈ నెల 8నే విడుదలవుతోంది. మంచు లక్ష్మి, ఆదిత్య ఓమ్, ప్రధానంగా కనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి ఆడియన్స్ ను థియేటర్స్ వరకూ రప్పించే సత్తా మంచు లక్ష్మికి ఉందా లేదా అనేది 8న తేలుతుంది.
ఇవి కాక జాతర, ద షార్ట్ కట్, వంచన, జ్యూయొల్ థీఫ్, ఈ సారైనా, రహస్యం ఇదం జగత్ వంటి తెలుగు మూవీస్ తో పాటు ఒక రోజు ముందుగానే తమిళ్ హీరో కెవిన్ నటించి బ్లడీ బెగ్గర్ విడుదలవుతోంది. మొత్తం 11 సినిమాలు. ఇంతమంది కలిసి ఆడియన్స్ ను రౌండప్ చేస్తే.. కన్ఫ్యూజన్ లో అన్నీ చూస్తారా లేక అసలేవీ చూడరా.. అనేది చూడాలి.