Maya Sabha Review : రివ్యూ : మయసభ

Update: 2025-08-07 09:01 GMT

రివ్యూ : మయసభ

ఆర్టిస్ట్స్ : ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్, దివ్య దత్, నాజర్, శ్రీకాంత్ అయ్యంగార్, శతృ, రవీంద్ర విజయ్, తాన్యా రవిచంద్రన్ తదితరులు

ఎడిటర్ : ప్రవీణ్ కేఎల్

మ్యూజిక్ : శక్తికాంత్ కార్తిక్

సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు, జ్ఞాన శేఖర్ విఎస్

నిర్మాతలు : విజయ్ కృష్ణ, లింగమనేని శ్రీ హర్ష

రచన, దర్శకత్వం : దేవా కట్టా

జానర్ : పొలిటికల్

స్ట్రీమింగ్ : సోనీ లివ్

బయోపిక్స్ ను రూపొందించడం రెగ్యులర్ స్టోరీస్ ను తెరకెక్కించినంత సులువు కాదు. అందరికీ తెలిసిన కథనే ఆశ్చర్యపరిచేలా చెప్పగలగాలి. ఆద్యంత రక్తి కట్టించే కథనం ఉండాలి. వివాదాలకు దూరంగా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. ఇదే పెద్ద కాంట్రాస్ట్. ఆ కాంట్రాస్ట్ కు కరెక్ట్ గా హ్యాండిల్ చేశా అని ముందు నుంచీ చెబుతూ వస్తున్నాడు మయసభ దర్శకుడు దేవా కట్టా. తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు ప్రధాన రాజకీయ నాయకుల జీవితాలను పోలిన కథ అని అందరికీ అర్థమైనా.. అతను ‘ఫిక్షన్’అన్నాడు. మరి ఈ ఫిక్షనల్ బయోపిక్ మయసభ ఎలా ఉందో చూద్దాం.

కథ :

కడప జిల్లాకు చెందిన ఎమ్ఎస్ రామిరెడ్డి(చైతన్య రావు)కు తండ్రి చేసే ఫ్యాక్షన్ అంటే ఇష్టం ఉండదు. దీంతో తన డాక్టర్ కోర్స్ చదవడం కోసం బళ్లారి వెళతాడు. చిత్తూరు జిల్లాకు చెందిన కాకర్ల కృష్ణమ నాయుడు( ఆది పినిశెట్టి)ది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయమే ఆధారం. కృష్ణమ నాయుడు పి.హెచ్.డి చదవాలనుకుంటాడు. కానీ వ్యవసాయం చేసే వాళ్లకు చదువెందుకు అనేది అతని తండ్రి వాదన. ఆర్థికంగానూ కష్టం అంటాడు. అయినా అతను పిహెచ్.డి కోసం యూనివర్శిటీలో జాయిన్ అవుతాడు. ఒక దశలో రామిరెడ్డి, కృష్ణమ నాయుడు అనుకోకుండా కలుసుకుంటారు. ఇద్దరి అభిరుచులు కలుస్తాయి. స్నేహితులవుతారు. ఆ స్నేహితులు తర్వాత ఒకే పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభిస్తారు. ఆ తర్వాత దేశంలోనూ, రాష్ట్రంలోనూ జరిగిన అనేక పరిణామాల కారణంగా కృష్ణమ నాయుడు ఆ పార్టీని వీడాల్సి వస్తుంది. ఆపై రాయపాటి చంద్రశేఖర్ రావు(ఆర్.సి.ఆర్) స్థాపించిన పార్టీలోకి వెళతాడు. అలా వెళ్లిన వీరి రాజకీయ జీవితంలో సంభవించిన మార్పులేంటీ.. ఏ సంఘటనలు వీరి జీవితాలను ప్రభావితం చేశాయి. ఆర్.సి.ఆర్ స్థాపించిన పార్టీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది మిగతా సిరీస్.

ఎలా ఉంది :

బయోపిక్స్ ను హ్యాండిల్ చేయడం స్క్రిప్ట్ మీద సాము లాంటిది. ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తానికే మోసం వస్తుంది. పైగా ఇద్దరు లెజెండ్స్, ఐకనిక్ పర్సన్స్ కథ అన్నప్పుడు ఎవరినీ ఎక్కువ, తక్కువలు చేయలేరు. పరిస్థితులు ఏవైనా.. సంయమనంతో కథనం ఉండాలి. ఈ విషయంలో దేవా కట్టా సూపర్ సక్సెస్ అయ్యాడు. తన ఫిక్షన్ అని చెప్పిన పాత్రలేంటో చూస్తున్న ప్రేక్షకులకు సులువుగా తెలిసిపోతుంది. ఆ విషయం దర్శకుడు చెప్పడు. ఇదే క్లవర్ రైటింగ్. ఆ రైటింగ్ దాదాపు అన్ని ఎపిసోడ్స్ లోనూ కనిపిస్తుంది.

బయోపిక్ అనగానే మరీ పుట్టిన దగ్గర నుంచి అన్నట్టు కాకుండా.. ఇద్దరు ప్రధాన పాత్రధారుల యవ్వన కాలం నుంచి మొదలుపెట్టడం బావుంది. ఇద్దరి సామాజిక కోణాలను ఆవిష్కరిస్తూ కథలో టెంపో పెంచుకుంటూ పోయాడు దర్శకుడు. అక్కడక్కడా నాన్ లీనియర్ లోనూ కథ చెప్పాడు. ఇది కూడా ఆకట్టుకుంటుంది. స్నేహితులు, రాజకీయాల్లోకి అడుగుపెట్టడం.. ఉడుకు రక్తంతో సమాజం కోసం పరితపించడం.. ఇవన్నీ కనిపిస్తాయి. అదే టైమ్ లో కేవలం ఇద్దరి మీదే ఫోకస్ చేయకుండా వీరి పొలిటికల్ లైఫ్ టైమ్ లో రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటలను కూడా చెప్పడం ఇంకా బావుంది. బెజవాడ రౌడీయిజం, కులం కోణంలో నాయకులుగా ఎదిగి చివరికి హత్యకు గురి కావడం.. మరోవైపు నక్సలిజం.. దాని ప్రభావం.. అంటూ చాలా అంశాలే టచ్ చేశాడు.

ఢీల్లీలో గద్దెనెక్కిన ఐరావతి బసు ఎమెర్జెన్సీ కారణంగా రాష్ట్రంలో మారిన పరిస్థితులు.. తద్వారా నటుడుగా వెలిగిపోతున్న రాయపాటి చంద్రశేఖర్ రావు.. రాజకీయ పార్టీని స్థాపించడం.. ఆ కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో సంభవించిన పెను మార్పులు... అటు రాయలసీమ ప్రాంతంలో ఉన్న రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులనూ చూపిస్తూ.. ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించాడు దేవా కట్టా. ఢిల్లీ ఎపిసోడ్స్ ను ఇంకాస్త బెటర్ గా రాసుకుని ఉండాల్సింది అనిపిస్తుంది. ఎలా చూసినా తెలుగులో వచ్చిన ది బెస్ట్ పొలిటికల్ సిరీస్ లలో మయసభ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పొచ్చు.

పాలిటిక్స్ నేపథ్యంలో హిందీలో చాలా సిరీస్ లు వచ్చాయి. వాటితో పోలిస్తే మయసభకు సార్వజనీనత ఎక్కువ. నేటివిటీకి తోడు వాస్తవ పాత్రలను పోలి ఉండటం.. దాదాపు అన్ని పాత్రలూ ఫిక్షనల్ గా ఉన్నా.. చూస్తున్నవాళ్లు పోల్చుకోవడంలో విజయం సాధించడం ఈ సిరీస్ లోని మరో ప్రత్యేకత.

నటన పరంగా చూస్తే ది బెస్ట్ కాస్టింగ్ అని కూడా చెప్పొచ్చు. కృష్ణమ నాయుడుగా ఆది పినిశెట్టి, రామిరెడ్డి చైతన్యరావు అద్భుతంగా నటించారు. ఆ పాత్రలను పూర్తిగా అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తారు. ఆర్సీఆర్ గా సాయికుమార్, ఐరావతి బసుగా దివ్యా దత్, విజయవాడ, రాయలసీమ ప్రాంత నాయకులుగా శతృ, రవీంద్ర విజయ్ అదరగొట్టారు. ఇతర పాత్రలన్నీ సహజంగానే కనిపిస్తాయి.

టెక్నికల్ గానూ చాలా బావుంది. సినిమాటోగ్రఫీ ఆ కాలానికి తగ్గ మూడ్ క్రియేట్ చేసేలా మంచి లైటింగ్ తో కనిపిస్తుంది. మ్యూజిక్ చాలా బావుంది. డైలాగ్స్ బాగా పేలాయి. మంచి డైలాగ్స్ పడ్డాయి కూడా. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా దేవా కట్టా ఈ తరహా కథలను ప్రభావవంతంగా తెరకెక్కించగలడు అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ కథపై అతనికి పూర్తి పట్టు ఉన్నట్టు కనిపిస్తుంది. ఏ సీన్ ను ఎక్కడ కట్ చేయాలో, ఏ పాత్రను ఎక్కడ ఎండ్ చేయాలో.. ఎంత వరకూ ప్రజెంట్ చేయాలో పర్ఫెక్ట్ గా రాసుకున్నాడు. అదే తెరపై కనిపిస్తుంది. అందుకే అతన్నుంచి మరోసారి బెస్ట్ అవుట్ పుట్ వచ్చిందని చెప్పొచ్చు.

మొత్తం 9 ఎపిసోడ్స్ గా ఉన్న ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ 45 నిమిషాల పాటు ఉంటుంది. ఒకటీ రెండు ఎపిసోడ్స్ మినహా మిగతా అంతా ఎంగేజింగ్ గా చివరి మూడు ఎపిసోడ్స్ చాలా గ్రిప్పింగ్ గా కనిపిస్తాయి. పైగా సిరీస్ కాబట్టి డబుల్ మీనింగ్స్, అశ్లీలత లాంటి వాటికి తావు లేకుండా కుటుంబ సమేతంగా చూసేలా మంచి క్లీన్ సిరీస్ గానూ కనిపిస్తుంది.

ఫైనల్ గా : ఆద్యంతం రస‘మయసభ’

రేటింగ్ : 3.5/5

Tags:    

Similar News