కొన్ని సినిమాల ట్రైలర్స్ చూస్తే వాటి రిజల్ట్ ను సులువుగానే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఏవో కొన్ని సందర్భాల్లోనే ఇలాంటి అంచనాలు మిస్ అవుతాయి. మరికొన్ని సినిమాల్లో కమర్షియల్ గా అంచనాలు మిస్ అయినా.. కంటెంట్ పరంగా అనుకున్నదే కనిపిస్తుంది. బలమైన కథలు, భావోద్వేగాలు పంచుతాయి. బట్ కమర్షియల్ వాల్యూస్ కూడా కనిపిస్తున్న ఇంటెన్స్, ఎమోషనల్ డ్రామాలా కనిపిస్తోన్న సినిమా అమరన్. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత చాలామందిలో ఉన్న సందేహాలు తొలగిపోయాయి. శివకార్తికేయన్ రేంజ్ కు ప్యాన్ ఇండియా సినిమా అవసరమా అన్నవాళ్లు కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత అతన్ని మర్చిపోయి కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు. యస్.. హీరోల రేంజ్ ను మార్చేది వారి కటౌట్స్ కాదు. కంటెంట్. యస్.. ఖచ్చితంగా కథలే హీరోలను తయారు చేస్తాయి. వాళ్లని మాస్ ఆడియన్స్ కు చేర్చాలా లేక ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు చేర్చాలా అనేది డిసైడ్ చేసేది కథలే కానీ.. సోకాల్డ్ కటౌట్స్, ఫ్యాన్ బేస్ లు కాదు. అమరన్ విషయంలోనూ అదే కనిపిస్తోంది.
తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ అనే మేజర్ కథ ఇది. అతని బయోపిక్ గా వస్తోన్న సినిమా. ఆర్మీలో లెఫ్టినెంట్ గా జాయిన్ అయ్యి తన ధైర్య సాహసాలతో కెప్టెన్ గా, మేజర్ గా ఎదిగిన వరద రాజన్ 2014 ఏప్రిల్ లో మేజర్ గా తన టీమ్ తో కలిసి టెర్రరిస్ట్ లు ఉన్నారనే సమాచారంతో సౌత్ కశ్మీర్ లోని ఓ విలేజ్ లో సెర్చ్ చేస్తుండగా టెర్రరిస్ట్ లు కాల్పులు మొదలుపెడతారు. ఊహించని ఆ పరిణామం నుంచి తన టీమ్ ను అలెర్ట్ చేసి ఎక్కువ సైనిక నష్టం లేకుండా చూసుకుని.. ఆ ఇండియన్ ముజాహిద్దీన్ చీఫ్ ను పట్టుకునేందుకు తనకు ఓ బుల్లెట్ తగిలినా వెనకాడకుండా చేసిన పోరాటంలో అమరుడైన వరద రాజన్ కు తర్వాత భారత ప్రభుత్వం అశోక చక్ర బిరుదును ప్రదానం చేసింది. ఓ గొప్ప యోధుడి కథను అంతే గొప్పగా వీళ్లు వెండితెరపై ఆవిష్కరించారు అనిపిస్తోంది.
మామూలుగానే తమిళులకు భాషాభిమానం ఎక్కువ. తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కథను ఆషామాషీగా తీయరు. ఈ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి కూడా చాలా జాగ్రత్తగా రూపొందించినట్టు అర్థం అవుతోంది. పైగా ఈ చిత్రానికి కమల్ హాసన్ మొదటి నిర్మాత. అందుకే కథ, కథనాల విషయంలో పక్కాగా ఉంటాడు అని వేరే చెప్పక్కర్లేదు. ఇక దీపావళికి ఇతర భాషల్లో ఎలా ఉన్నా.. తెలుగులో గట్టి పోటీ ఉంది. ఈ పోటీలో నిలబడి గెలిచే సత్తా ఉన్న కథలాగే కనిపిస్తోందీ అమరన్. పైగా శివకార్తికేయన్ తో పాటు సాయి పల్లవి కూడా నటించింది. తను కూడా ఈ ప్రాజెక్ట్ కు మరింత ప్లస్ అవుతుంది. తెలుగులో ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. చేస్తే మూవీపై అంచనాలు పెరుగుతాయి. మొత్తంగా ట్రైలర్ తర్వాత దీపావళి రేస్ లో అమరన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు అనేది నిజం.