Kollywood Director : చిత్ర పరిశ్రమలో మరో విషాదం..అనారోగ్యంతో డైరెక్టర్ మృతి
కోలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, నటుడు వేలు ప్రభాకరన్ (68) కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా గుండె సంబంధిత సమస్య తో బాధ పడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడం తో ICU లో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు.అయితే పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.
అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకుడు గా పని చేశారు వేలుప్రభాకరన్. రచయిత గా, దర్శకుడి గా, సినిమాటోగ్రాపర్ గా తమిళ చిత్ర పరిశ్రమ లో తనదైన ముద్ర వేశారు ప్రభాకరన్. 1980లో 'ఇవర్గల్ విద్యాసమనవర్గల్' చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆయన..1989లో 'నాలయ మనితన్' చిత్రంతో దర్శకుడిగా మారారు.అధిసయ మనితన్', 'కడవుల్', '5', 'పురట్చిక్కారన్' వంటి చిత్రాలను రూపొందించారు. 'కడవుల్' చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా తమిళనాడు రాష్ట్ర అవార్డును అందుకున్నారు.ఆయన సినిమాలు నాస్తికత్వం, విప్లవాత్మక, వివాదాస్పద అంశాలతో నిండి ప్రసిద్ధి చెందాయి. నటుడిగా 'గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్', 'కడావర్', 'గజానా' వంటి చిత్రాల్లో నటించారు. కాగా ఆయన మృతదేహాన్ని ఎల్లుండి మధ్యాహ్నం వరకు చెన్నెలోని ఆయన నివాసంలో సందర్శకుల కోసం ఉంచనున్నారు. అనంతరం పోరూర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. వేలు ప్రభాకరన్ మృతికి తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి అర్పించారు.