రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు హను రాఘవపూడి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు అనుకోకుండా ఓ సమస్య వచ్చింది. సినిమా సెట్లోకి అడుగు పెట్టేందుకు ఆయనకు గోడ అడ్డం వచ్చింది. దీంతో ఆ గోడ దూకి షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఏదైనా జరగవచ్చు అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 70 ఏళ్ల వయసులోనూ అనుపమ్ ఈ విధంగా చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా మూవీ తెరకెక్కుతుండగా బాలీవుడ్ స్టార్ అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిఫరెంట్ స్టోరీ, భారీ బడ్జెట్తో మూవీ తెరకెక్కుతుండగా.. భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'ది రాజాసాబ్', సందీప్ వంగా 'స్పిరిట్' షూటింగ్స్ లైనప్లో ఉన్నాయి. వీటి తర్వాత 'కల్కి 2', 'సలార్ 2' ప్రాజెక్టులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.