అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఘాటీ. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ తో పాటు సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నాం అని కూడా అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిషా బోర్డర్ లో సాగే కథ అని ముందే చెప్పారు. బాధితుల నుంచి తిరుగుబాటు దారులుగా తర్వాత లెజెండ్స్ గా మారిన ఓ మహిళ కథ అని కూడా చెప్పాడు క్రిష్. కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా వచ్చిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. బాహుబలి తర్వాత అనుష్క మళ్లీ అంతటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతోందని తెలుస్తోందీ టీజర్ తో.
ఏపి, ఒడిషా బోర్డర్ లో బ్రిటీష్ కాలం నుంచి ఉంటోన్న ‘ఘాటీ’అనే తెగకు సంబంధించిన కథ. వారికి అడవులపై పూర్తి పట్టు ఉంటుంది. గంజాయి పడించే కొందరు దళారీలు.. అలాంటి వారిని వాడుకుని వారితో గంజాయి పండించి సరఫరా చేయించడం.. కాదంటే కర్కశంగా చంపేయడం చేస్తుంటారు. ఓ దశలో వీళ్లే వ్యాపారం చేయాలనుకుంటారు. దాన్నీ అణచాలని చూస్తారు. ఆ ఆలోచన వచ్చినందుకూ హింసిస్తారు. మరోవైపు దీని వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయని తెలుసుకున్న ఆమె అసలు ఆ వ్యాపారమే లేకుండా చేయాలని.. వారి సామ్రాజ్యాన్ని అంతం చేయాలనం పంతం పడుతుంది. అనుకున్నది సాధిస్తుంది అనేది కథ అని పూర్తిగా ట్రైలర్ తో చెప్పాడు క్రిష్.
విజువల్స్ చూస్తే సూపర్బ్ గా ఉన్నాయి. అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్, విక్రమ్ ప్రభుతో రొమాన్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. విక్రమ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ అవుతుందేమో అనేలా ఉంది. అలాగే అతని పాత్ర చనిపోయిన తర్వాతే అనుష్క రెబల్ గా మారుతుంది అనే హింట్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్ లో అందరికంటే ఎక్కువ సర్ ప్రైజ్ చేసింది చైతన్య రావు. 21 వెడ్స్ 30 అనే యూ ట్యూబ్ సిరీస్ తో ఫేమ్ అయిన అతను చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. స్టార్డమ్ రాలేదు. కానీ చూడగానే ఇన్నోసెంట్ లా అనిపించే చైతన్య రావుతో ఘాటీలో చాలా క్రూరమైన పాత్ర చేయించినట్టున్నాడు. అతనూ బాగా చేశాడనిపిస్తోంది. కాకపోతే ట్రైలర్ లోనే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ తేలిపోయేలా ఉన్నాయి. పెద్ద తెర పైన ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు టైమ్ కూడా లేదు కాబట్టి పెద్దగా సరిచేయరేమో. నిజానికి విఎఫ్ఎక్స్ కోసమే ఇంత ఎక్కువ టైమ్ తీసుకున్నాం అని కూడా చెప్పారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రానికి సాగర్ నాగవెల్లి సంగీత దర్శకుడు. సినిమాను అంతా ఊహించినట్టుగానే సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు.