రివ్యూ : అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, అజయ్, జాన్ విజయ్, వైవా హర్ష, సత్య తదితరులు
ఎడిటింగ్ : నవీన్ నూలి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సన్నీ ఎమ్.ఆర్
సంగీతం : కార్తీక్
సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ప్రసాద్
నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : సుధీర్ వర్మ
కొన్ని సినిమాల రిజల్ట్స్ చూసేవారికంటే తీసిన వారికి ముందుగానే తెలిసిపోతుంది. అలా తెలిసిపోయిందేమో అని ఈ మధ్య కాలంలో ఎక్కువమందికి అనిపించిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. నిఖిల్ సిద్ధార్థ్, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని సుధీర్ వర్మ డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం సుధీర్ ఫామ్ లో లేడు. దీంతో ఈ మూవీతో ప్రూవ్ చేసుకుంటాడేమో అని చాలామంది భావించారు. బట్ ప్రమోషన్స్ విషయంలో ఎవరూ పట్టించుకోలేదు. చాలా లో బజ్ తో ఇవాళ విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ :
రిషి(నిఖిల్) తార( రుక్మిణి వసంత్) అనే అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తార కూడా అతన్ని ప్రేమిస్తుంది. కానీ రిషి ఫ్రెండ్ యాజి( వైవా హర్ష) చేసిన మిస్టేక్ వల్ల ఆ ప్రేమకథ అక్కడితో ముగిసిపోతుంది. బాధలో ఉన్న రిషిని తనతో పాటు లండన్ తీసుకువెళ్లి అతను కోరుకునే రేసింగ్ కోర్స్ లో జాయిన్ చేయిస్తాడు యాజి. అక్కడ రేసర్ గా ఎదుగుతున్న రిషి లైఫ్ లోకి తులసి(దివ్యాంశ) అనే అనాథ ఎంటర్ అవుతుంది. ఆమెకు ఎవరూ లేరని తనే షెల్టర్ ఇస్తాడు రిషి. ఆ క్రమంలో ప్రేమలో పడతారు. తీరా పెళ్లి పీటల వరకూ వెళ్లేసరికి తులసి మిస్ అవుతుంది. అదే టైమ్ లో తార మెకానికల్ ఇంజినీరింగ్ లో ఇంటర్న్ షిప్ చేయడానికి లండన్ లోని రిషి ఉన్న ప్లేస్ కే వస్తుంది. మళ్లీ ఇద్దరూ దగ్గరవుతారు. తార తన మనసులో మాట చెప్పే టైమ్ కు తులసి వస్తుంది. అపార్థం చేసుకుని వెళ్లిపోతుంది తార. తనను కన్విన్స్ చేసే టైమ్ లోనే తులసిని ఎవరో హత్య చేస్తారు. ఆ హత్య నుంచి తప్పించుకునే క్రమంలో రిషి, యాజి పోలీస్ లకు చిక్కుతారు. మరి ఆ తర్వాత ఏమైంది. తులసిని చంపింది ఎవరు..? ఎందుకు..? అసలు తులసి నేపథ్యం ఏంటీ..? తులసికి బద్రి అనే డాన్ కు ఉన్న సంబంధం ఏంటీ అనేది తెరపైనే చూడాలి.
ఎలా ఉంది.?
టైటిల్ కు తగ్గట్టుగానే ఇది ఎప్పుడో తీసిన సినిమా. అప్పుడే విడుదలవకుండా ఎందుకు వుందో కానీ ఇప్పుడు విడుదలైంది. బట్.. ఎప్పుడు చూసినా బోర్ కొట్టడం ఖాయం అనేలా ఉంది. కేవలం రెండు గంటల నిడివి మాత్రమే ఉన్నా.. మూడు గంటల సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అంత స్లో నెరేషన్ తో ఏ మాత్రం కొత్తదనం లేని కథనంతో కావాల్సినంత విసిగిస్తాడు దర్శకుడు సుధీర్ వర్మ.
క్రైమ్ డ్రామా కథ ఇది. ఆ తరహా కథల్లో ఉండే టెంప్లేట్ ను ఏ మాత్రం మార్చకుండా అత్యంత రొటీన్ స్క్రీన్ ప్లే తో రూపొందించాడు దర్శకుడు. ఎక్కడా కొత్తదనం ఉన్న సన్నివేశం కానీ, కథనం కానీ కనిపించదు. అంత రొటీన్ గా ఉంటుంది. రిషి, తార మధ్య లవ్ ట్రాక్ అయితే 90ల్లోనే వచ్చింది. ఇప్పటికీ అక్కడే ఆగిపోయాడు దర్శకుడు. ఇక తులసి ఎపిసోడ్ ను కాస్త ఇంట్రెస్టింగ్ గానే మలిచినా.. ఆ క్యారెక్టర్ కు నెగెటివ్ షేడ్ సెట్ చేయడం.. విలన్ కు అన్ని రోగాలూ ఉండటం.. ఒక చిన్న డివైజ్ లో 500 కోట్లు ట్రాన్స్ ఫర్ కావడం.. ఇవన్నీ సిల్లీగా ఉన్నాయి. ఈ పాయింట్ కొత్తగా ఉంది అనిపించేలా ఒక్కటీ కనిపించలేదు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఏ సీన్ ఎందుకు వస్తుందన్నది అర్థం కాదు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో మొదలైన కథ ముందు ఆరు నెలలు వెనక్కి, తర్వాత రెండేళ్లు వెనక్కి వెళ్లడం.. మళ్లీ ఒన్ ఇయర్ బ్యాక్ అంటూ స్క్రీన్ ప్లే పరంగా చూస్తున్నవారిని ఇంకా వెనక్కే తీసుకువెళ్లాడు. దీంతో ఆ కాలంలోనే ఈ తరహా కథలు అనేకం చూశాం కదా అనే ఫీలింగ్ తో మరింత భారంగా ఉంటుంది.
ఇక సెకండ్ హాఫ్ లో క్రైమ్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఆ ఎలిమెంట్ కూడా ఎప్పటి నుంచో ఉన్నదే. ఇలాంటి సినిమాలకు కామెడీ ఎసెట్ అవుతుంది. బట్ ఈ మూవీలో మైనస్ అయింది. ఏ కామెడీ సీన్ కూడా పేలలేదు. ఇక విలన్ తో పాటు అజయ్ ఎంట్రీ ఇచ్చినప్పుడే వీరిది సెకండ్ హాఫ్ లో వచ్చే పాత్రలు అని అర్థం అవుతుంది. 500 కోట్ల కోసం సాగే పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారు అనే పాయింట్ ను కూడా సులువుగానే ఊహించేయొచ్చు. టోటల్ గా చూస్తే.. ఇది ఇన్నాళ్ల పాటు రిలీజ్ కాకుండా ఆగింది అంటే రీజన్ ఏంటో సినిమా చూస్తే అర్థం అవుతుంది. అసలా మాటకొస్తే.. అప్పుడే విడుదలైనా ఇదే టాక్ వచ్చేదేమో.
నటన పరంగా నిఖిల్ నాలుగేళ్ల క్రితం లుక్ కాబట్టి చాలా యంగ్ గా కనిపించాడు. రుక్మిణి వసంత్ బ్యూటీఫుల్ గా ఉంది. కానీ తన టాలెంట్ కు తగ్గ పాత్ర కాదు. నటన పరంగా ఆమె చేయాల్సిందేం లేదీ మూవీలో. దివ్యాంశం కౌశిక్ పాత్ర, నటన ఆకట్టుకుంటాయి. జాన్ విజయ్ కనిపించినంత సేపూ చిరాకు పెట్టించాడు. అజయ్ ఓకే. వైవా హర్ష ఈ సారి తేలిపోయాడు. సత్య, సుదర్శన్ ల కామెడీ సైతం మెప్పించలేదు.
టెక్నికల్ గా పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం పెద్ద మైనస్. చాలా అంటే చాలా డల్ గా ఉంది. ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ బావుంది. దర్శకత్వం పరంగా ఇది పూర్తిగా సుధీర్ వర్మ ఫెయిల్యూర్. తన మార్క్ టేకింగ్ సైతం మిస్ అయింది.
ఫైనల్ గా : ఎప్పుడు చూసినా బోర్ కొట్టే సినిమానే
రేటింగ్ : 1.75/5
- కామళ్ల. బాబురావు