ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) , వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ ఆనంద్ (Viraj Anand) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ. గతేడాది చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే ఎస్‌కేఎన్ నిర్మాతగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కథ నాదే అంటూ నాదేనంటూ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదు చేశాడు.
2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని డైరెక్టర్ సాయిరాజేశ్ కోరినట్లు శ్రీరామ్ తెలిపాడు. అలా ఆయనతో పరిచయం ఏర్పడిందన్నాడు. ఈ క్రమంలో బేబి సినిమా కథను తాను సాయి రాజేశ్‌కు చెప్పానని తెలిపాడు. కన్నా ప్లీజ్ అనే టైటిల్ తో తాను ఈ కథను రాసుకున్నట్లుగా వెల్లడించాడు. ఇదే కథను కొన్నేళ్ల తర్వాత అంటే 'బేబీ' టైటిల్‌తో సినిమా తెరకెక్కించారని ఆరోపించాడు. వారు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
బేబీ సినిమా విడుదలైన తరువాత కేవలం 11 రోజుల్లో దాదాపు 70 కోట్ల కలెక్షన్స్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ఆగస్ట్ 25న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
బాలీవుడ్ లోకి బేబి
బేబీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. అక్కడ కూడా ఈ సినిమా కూడా సాయి రాజేశే దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అదే కథను హిందీలోనూ తెరకెక్కించనున్నారు సాయి రాజేష్. అంతే కాదు ఈ సినిమాకు కల్ట్ బొమ్మ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ నటిస్తుందని తెలుస్తోంది.