ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవలే సినీ ప్రస్థానంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న బాలయ్య బాబు లండన్ కు చెందిన 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు బాలకృష్ణను కలిసి రికార్డు పత్రాన్ని అందజేశారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నటుడు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'ఎక్స్' వేదికగా ఆయనకు అభినందనలు తెలిపారు.
"బాలనటుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి, జానపద, కుటుంబ, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. నట జీవితంలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించడం ఎంతో అభినందనీయం" అని పవన్ పేర్కొన్నారు. ఆయన ఇలానే మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను" అని పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.