నందమూరి బాలకృష్ణ అంటే చాలా వరకూ మాస్ మూవీస్ గుర్తొస్తాయి. కానీ టాలీవుడ్ లో ఎన్టీఆర్ తర్వాత బాలయ్య చేసినన్ని వైవిధ్యమైన జానర్స్ చేసిన హీరో మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. యాక్షన్, ఫ్యాక్షన్, ఫాంటసీ, ఫోక్లోర్ ఇలా అన్ని జానర్స్ లోనూ అద్భుతమైన విజయాలు అందుకున్న ఏకైక హీరో బాలకృష్ణ మాత్రమే. ఆయన యంగ్ ఏజ్ లో ఉండగా చేసిన మూవీ ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. అంతేకాదు.. ఇది ఇండియాలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమాగా రికార్డూ కొల్లగొట్టింది. వర్తమానం నుంచి మొదలై భూత, భవిష్యత్ కాలాల్లోకి వెళ్లే హీరో కథ.
ఓ సైంటిస్ట్ జీవితాంతం కష్టపడి తయారు చేసిన టైమ్ మెషీన్ లోకి హీరో, హీరోయిన్ తో పాటు ఓ కానిస్టేబుల్ కూడా ఎక్కడం.. అది అనుకోకుండా స్టార్ట్ అయ్యి విజయనగర సామ్రాజ్య కాలానికి వెళ్లడం.. ఆ టైమ్ లో శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలం ఉండటం కట్ చేస్తే సినిమా కొంత భాగం ఆ కాలంలో సాగుతుంది. అదంతా చూడ్డానికి రెండు కళ్లూ చాలవన్నట్టుగా చిత్రీకరించారు సింగీతం శ్రీనివాసరావు. ఈ పార్ట్ లోనే సిల్క్ స్మిత పాట, ఎత్తుగడలు అటు మాస్ ను కూడా మెప్పించేలా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి మళ్లీ వర్తమానానికి వెళ్లాలి అనుకుంటే అది భవిష్యత్ కాలంలోకి తీసుకువెళుంది. ఇలాంటి విన్యాసాలతో ఆబాల గోపాలాన్ని అలరించే కథ, కథనం, మాటలు, పాటలతో సింగీతం ఈ చిత్రాన్ని ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మలిచారు. అలాంటి సినిమాలు ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది..? యస్.. ఆ ఊహ నుంచే ఈ చిత్రాన్ని ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ చేస్తూ మళ్లీ విడుదల చేయబోతున్నారు.
ఈ వేసవిలో ఆదిత్య 369ను రీ రిలీజ్ చేయబోతున్నాం అని శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్స్ చూస్తే మరోసారి అద్భుతమైన క్వాలిటీతో ఈ క్లాసిక్ ను చూడబోతున్నాం అనే ఫీలింగ్ వస్తుంది.
ఇక 1991 జూలై 18న విడులైన ఈ చిత్రంలో బాలయ్య సరసన మోహిని హీరోయిన్ గా నటించింది. అమ్రిష్ పురి, టీనూ ఆనంద్, మాస్టర్ తరుణ్, సిల్క్ స్మిత, జెవి సోమయాజులు, చంద్ర మోహన్, సుత్తివేలు, శ్రీ లక్ష్మి వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఇళయరాజా సంగీతం, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మెయిన్ హైలెట్ గా నిలిచాయి. సో.. త్వరలోనే రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతోన్న ఈ మూవీ కోసం చాలామంది ఫ్యాన్సే ఉన్నారని చెప్పాలి.