తెలుగు నాట సినిమా థియేటర్స్ బంద్ అనే మాట రెండు రోజులుగా బలంగా వినిపిస్తోంది. రీసెంట్ గా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో ఫిల్మ్ ఛాంబర్ సమావేశం అయింది. అంతకు ముందు నుంచే షేరింగ్ సిస్టమ్ ద్వారా ప్రధానంగా సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోతున్నాయని.. థియేటర్ యజమానులు నష్టాలను భరించలేకపోతున్నారని.. అందుకే రెంటల్ సిస్టమ్ ద్వారా సినిమాలు ప్రదర్శించాలని, ఎగ్జిబిటర్స్ కొన్నాళ్లుగా బలంగా కోరుతున్నారు. ఇటు ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో థియేటర్స్ బంద్ అనే మాట ఎత్తుకున్నారు. దీంతో ఇండస్ట్రీలో రెగ్యులర్ గా సినిమాలు నిర్మిస్తున్న వారితో పాటు కొంత గ్యాప్ ఇచ్చిన వారి మధ్య కొంత తేడాలు కనిపిస్తున్నాయి. సీనియర్స్ రెంటల్ సిస్టమ్ కు కాస్త మద్ధతు తెలుపుతున్నారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ నో చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన రెండు మీటింగ్స్ కూడా ఎగ్జిబిటర్లకు సంతృప్తి కరంగా లేకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అంటున్నారు. అసలు ఈ రెండు విధానాలేంటీ.. ఆ విధానాల ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం.. అనేది చూస్తే..
ప్రస్తుతం పర్సెంటేజ్ విధానంలో ఎగ్జిబిటర్లకు డబ్బులు చెల్లిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఒక సినిమా థియేటర్ లో వేసిన తర్వాత వచ్చిన లాభాల్లో నుంచి థియేటర్ యాజమాన్యానికి కొంత పర్సెంట్ చెల్లిస్తారు. దీనివల్ల నిర్మాతల షేర్, డిస్ట్రిబ్యూటర్ల షేర్ పోగా థియేటర్స్ కు మిగిలేదేం ఉండటం లేదు అనేది వారి వాదన. దీనికి తోడు విపరీతమైన టికెట్ ధరలు పెంచడం ద్వారా ప్రేక్షకులు ఎక్కువ రోజులు థియేటర్ కు రావడం లేదు. అదీ మరో రకమైన నష్టానికి కారణం అవుతోంది అనేది వారు చెబుతున్న మాట.
డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ ప్రకారం రెంటల్ విధానం అయితే.. సినిమా ప్రదర్శనకు ముందే థియేటర్స్ వారికి కొంత మొత్తం చెల్లించి.. తమ సినిమాలను ప్రదర్శించుకుంటారు. లాభ నష్టాలతో పనిలేకుండా ఎన్ని రోజులు ఆడితే లేదా వారాల లెక్కల రెంట్స్ కు ఇస్తారు. దీంతో ఎగ్జిబిటర్లు చాలా వరకూ సేఫ్ అవుతారు. అటు ఎగ్జిబిటర్స్ కూ ఇబ్బంది ఉండదు అంటున్నారు. అయితే ఇక్కడ సినిమా తేడా వస్తే ఓవరాల్ గా నిర్మాత నష్టపోతాడు అనేది వీరి భావన.
నిర్మాత నష్టపోవడానికి ప్రధాన కారణం హీరోల రెమ్యూనరేషన్స్. రెంటల్స్ లో సినిమాలు ఆడిస్తే.. తద్వారా నిర్మాతల నష్టాన్ని నివారించుకోవడానికి హీరోల రెమ్యూనరేషన్స్ తగ్గిస్తారు అంటున్నారు. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్ లో ప్రాక్టికల్ గా అది సాధ్యమయ్యేదే కాదు. అందుకే వ్యవహారం ఎటూ తేలకుండా ఆగిపోయింది. జూన్ 1కి ఇంకా పది రోజులు ఉంది. ఈ లోగా సమస్యను పరిష్కరించుకునే అవకశాలు చాలానే ఉన్నాయి. కాకపోతే ఎవరి డిమాండ్ కు తలొగ్గడం కాకుండా మధ్యే మార్గంగా పరిష్కారం చూసుకుంటే మంచిది. అయితే ఆ మార్గానికి మధ్యవర్తిత్వం వహించేది ఎవరు అనేదే ఇప్పుడు పెద్ద సమస్య.