MOVIES: ఇవీ "బ్లాక్" బస్టర్ సినిమాలు
మోసాలతో చేసిన డబ్బులతో సినిమాలు... మధ్యప్రదేశ్‌లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి 'బ్లాక్' సినిమా దందా*
చిత్రాలు... నీలి చిత్రాలు కామన్.. నల్లటి చిత్రాలు ఇప్పుడు ట్రెండింగ్. సినిమా అంటే కళ, ఎంటర్టైన్మెంట్ అనేవి కాదు. నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చే సాధనలు అంతే. మరో ఎప్పుడో సినిమాలు ఆపేసిన నిర్మాతలు అప్పుడప్పుడు భలే ప్యాషన్ తో సినిమాలు తీస్తుంటారు. అలాగే మరికొందరికి సినిమా అంటే ఎంతో వ్యావోమొహమో.. తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయినా వారి వ్యామోహం మాత్రం తగ్గదు. దీంతో సినిమా పిచ్చి అనేది దర్శకుడు, రచయిత, నటుడు లాంటి కళాకారులకే కాదు తెల్ల మనసున్న నిర్మాతలకు కూడా ఉంటుందని అర్థం చేసుకోవాలి. వీళ్లకు ట్యాక్స్ సేవింగ్, బ్లాక్ టు వైట్ వంటి కాన్సెప్టులే తెలియవు. నిజ్జం!
ఎక్సైజ్ టు సినిమా
మధ్యప్రదేశ్‌లో పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు చూసి అధికారులు ఖంగుతిన్నారు. అతడి ఆదాయానికి, సోదాల్లో దొరికిన సంపదకు ఏమాత్రం పొంతనలేదని గుర్తించారు. కిలోల కొద్దీ బంగారం, వెండి, నోట్ల కట్టలు, పెట్టుబడుల గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ధర్మేంద్రసింగ్ భదౌరియా మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్సైజ్ అధికారిగా పనిచేసి, రిటైర్ అయ్యాడు. అతడి వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో విచారణ చేపట్టగా.. అతడు సినిమాల్లో సినిమాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది
మనం తక్కువేం కాదు..
నిర్మాత అట్లూరి నారాయణరావు.. కొన్ని నెలల క్రితం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన పేరు. ఆయన చాక్లెట్ల డిస్ట్రిబ్యూషన్ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించి.. అధిక లాభాలు ఎరవేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 530 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. బంజారాహిల్స్‌లోని ఆదిత్య హిల్‌టాప్ అపార్టుమెంట్‌లో నివాసముంటూ.. సినీ రంగంలోకి నిర్మాతగా ప్రవేశించాడు. 2018లో ‘నీది నాది ఒకే కథ’, 2022లో ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ చిత్రాలు తీశాడు. ఈ సినిమాలకు అవసరమైన డబ్బు కోసం శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన 3 ఎకరాల భూమికి నకిలీ పత్రాలు సృష్టించి, వాటి ఆధారంగా ఖైరతాబాద్‌లోని ఎస్‌ఎంహెచ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సయ్యద్ మహమూద్ హుస్సేన్‌ను సంప్రదించి.. ఆ స్థలాన్ని అమ్ముతానని నమ్మించి అతడి వద్ద కోటి రూపాయలు వసూలు చేశాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయంటూ చెప్పుకుంటూ.. వారితో దిగిన ఫొటోలను వ్యాపారులకు చూపించాడు. విశాఖ, కర్ణాటకకు చెందిన కంపెనీల మధ్య జరుగుతున్న వివాదాన్ని కూడా పరిష్కరిస్తానంటూ నమ్మించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
ఈ నల్ల చిత్రాల కథ కేవలం అక్రమాస్తులున్న ప్రభుత్వ ఉద్యోగులు లేదా భారీ మోసాలు చేసిన వ్యాపారులకే పరిమితం కాదు. సినిమా పరిశ్రమలో ఉండే గ్లామర్, పేరు ప్రఖ్యాతులు, అధికారిక పరిచయాలు.. ఇవన్నీ కొందరికి నల్లధనం దాచుకోవడానికి, తెల్లగా మార్చుకోవడానికి దారులను తెరుస్తాయి. సినిమా అంటే కోట్లు, వందల కోట్లతో కూడిన వ్యవహారం కాబట్టి, ఎవరికి ఎన్ని కోట్ల పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందనేది లోతుగా తనిఖీ చేసే వ్యవస్థ చాలా సార్లు కరువవుతుంది. దీంతో, కొందరు తమ అక్రమ సంపాదనలో కొంత భాగాన్ని "సినిమా నిర్మాణ వ్యయం" అనే ముసుగులో పెట్టి, ఆ సినిమా ఫ్లాప్ అయినా, హిట్టయినా సరే, చట్టబద్ధమైన ఆదాయంగా చూపించడానికి ప్రయత్నిస్తారు. ఫ్లాప్ అయితే పోయింది నల్లధనమే కదా అనుకొని, మిగిలిన దానిని సేఫ్ చేసుకొనే ఎత్తుగడ ఇది. అందుకే, అకస్మాత్తుగా రంగంలోకి దూకి, భారీ బడ్జెట్ సినిమాలు తీసి, ఒక్క హిట్ కూడా లేకుండా మాయమయ్యే నిర్మాతలు మనకు తరచూ కనిపిస్తుంటారు.