Allu Arjun : అల్లు అర్జున్ కు కన్ను పోయిందా కాలు పోయిందా - రేవంత్ రెడ్డి

Update: 2024-12-21 10:32 GMT

ఈ నెల 4న పుష్ప 2 మూవీ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందడం టాలీవుడ్ లో అనేక సంచలనాలకు కారణమైంది. ఈ కేస్ లో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. ఇండస్ట్రీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ ఘటన పొలిటికల్ వార్ కు సెంటర్ పాయింట్ గా మారింది. ప్రభుత్వం, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అది ఇప్పుడు అసెంబ్లీ వరకూ వచ్చింది.

ఘటన జరిగిన రెండు మూడు రోజుల వరకూ పుష్ప 2 నిర్మాతలు కానీ, హీరో కానీ, దర్శకుడు కానీ ఎవరూ స్పందించలేదు. ఆ కుటుంబానికి సంఘీభావం తెలపలేదు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్ చేసిన తర్వాతే రియాక్ట్ అయ్యారు. అప్పుడే మినిస్టర్ బెన్ ఫిట్ షోస్ కు ఇక అనుమతి ఇవ్వం అని చెప్పాడు.

తాజాగా అదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే రేవతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున 25 లక్షల సాయం అందించనున్నట్టు కూడా తెలిపాడు రేవంత్ రెడ్డి.ఇకపై బెన్ ఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వం అని స్పష్టం చేశాడు. అంతే కాదు తను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు బెన్ ఫిట్ షోస్ మాత్రమే కాదు.. టికెట్ ధరలు కూడా పెంచను అంటూ స్పష్టం చేశాడు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన్ని పరామర్శించడానికి వెళ్లిన టాలీవుడ్ పై తీవ్ర విమర్శలు చేశాడు రేవంత్ రెడ్డి.

'ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ కు ఈయన(అల్లు అర్జున్) ఇంటికాడ క్యూ కట్టి ఇప్రభుత్వాన్ని తిడుతుర్రు, నన్ను తిడుతుర్రు.. అతన్ని పరామర్శిస్తుర్రు. ఏమైంది అధ్యక్షా ఆయనకేమన్న కాలు పోయిందా కన్ను పోయిందా ఏమన్న కిడ్నీలు దెబ్బతిన్నయా.. ఏమైంది.? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించిర్రు, కలిసిర్రు.. అభినందించిర్ర. కానీ ఆ పిలగాణ్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే.. సినిమా ఇండస్ట్రీ, ప్రముఖులు.. ఏం ఆలోచిస్తుర్రో, ఏం కోరుకుంటున్రో నాకైతే తెలవదు.." అంటూ అసెంబ్లీలో స్పీకర్ ను ఉద్దేశిస్తూ మాట్లాడటం సంచలనం సృష్టిస్తోంది.

చూస్తుంటే ఇండస్ట్రీ ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డిని లైట్ తీసుకుంటోంది. ఈ విషయంలోనే అతను హర్ట్ అయినట్టున్నాడు. మరి రేవంత్ రెడ్డి మాటలపై టాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారా అనేది చూడాలి. 

Tags:    

Similar News