యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించలేకపోతున్నామని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. ‘ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దవడంతో తన అభిమానులతో విజయోత్సవ ఈవెంట్‌ను నిర్వహించాలని తారక్ అన్న నిశ్చయించుకున్నారు. కానీ, దసరా, దేవీ నవరాత్రుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేడుకలకు అనుమతులు రావట్లేదు. అభిమానులు, ప్రేక్షకులు క్షమించాలి. అయినప్పటికీ ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నారు.
‘‘దేవర’ని ఈ స్థాయిలో ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంలో సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోవడంతో విజయోత్సవ వేడుకనైనా ఘనంగా చేయాలని ఎన్టీఆర్ ఎంతో భావించారు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉన్న కారణంగా మా వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయాం. ఈ పరిస్థితి మా నియంత్రణలో లేదు. ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోతున్నందుకు అభిమానులను క్షమాపణలు కోరుతున్నాం. వేదిక అనుమతి కోసం మేము ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం. మీ ప్రేమతో ఎన్టీఆర్ మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నా’’ అని పోస్ట్ పెట్టారు.