VV Vinayak: 'సాక్షి' రిలీజ్ డేట్ పోస్టర్
జూలై 21న థియేటర్లోకి రాబోతోంది;
సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి మరో హీరో శరణ్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శరణ్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా 'సాక్షి'. శివ కేశన కుర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్.యు.రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా మునగాల సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. 'విజయ నిర్మల గారి ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ సినిమాను సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి వెనకాల ఉండి ఆర్.యు.రెడ్డి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఈ మూవీతో శరణ్‌కు మంచి పేరు రావాలని, కొత్త దర్శకుడిగా పరిచయం కాబోతున్న శివకు ఈ సినిమా హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని వినాయక్ అన్నారు.
హీరో శరణ్ మాట్లాడుతూ.. 'సాక్షి సినిమా రిలీజ్ డేట్‌ను వి.వి.వినాయక్ గారు రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మీడియా, ప్రేక్షకుల సహకారం కావాల'ని అన్నారు. దర్శకుడు శివ మాట్లాడుతూ.. 'టీం అంతా సహకరించింది. భీమ్స్ మంచి సంగీతాన్ని అందించారు. హీరో శరణ్ ఎంతో చక్కగా నటించారు. మా సినిమా జూలై 21న రాబోతోంది. అందరి సహకారం కావాల'ని కోరారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీర్ కౌర్ నటిస్తుండగా.. నాగబాబు మెయిన్ విలన్‌గా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అజయ్, ఇంద్రజ, ఆమని ఇలా భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిట్ సినిమాలకు సంగీతమందిస్తున్న భీమ్స్ సిసిరీలియో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. సాక్షి సినిమా జూలై 21న థియేటర్లోకి రాబోతోంది.