నటి సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ అంశంపై ఈ మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్ అత్యవసర మీడియా సమావేశం నిర్వహించనుంది. అందులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని సహా పలువురు నటీనటులు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు’ అని పేర్కొన్నారు.
సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. ‘సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి ప్రవర్తన తెలుగు సంస్కృతి, విలువలకు విరుద్ధం. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను అంగీకరించకూడదు. మహిళల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, వారి గోప్యతను గౌరవించాలని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు.*