పుష్ప2 లో విలన్ గా నటించిన ఫహాద్ ఫాజిల్ వాయిస్ పై మళయాలంలో ఓ రచ్చ నడుస్తోంది. పుష్ప లో భన్వర్ సింగ్ షెకావత్ గా సినిమా సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయిన పాత్ర ఇంపాక్ట్ చాలా బలంగా కనిపించింది. ఆ క్యారెక్టర్ ను ఎండ్ చేసిన విధానం చూస్తే సెకండ్ పార్ట్ లో ఈ ఇద్దరి మధ్యే సాగుతుంది అంతా అనుకున్నారు. బట్ ఆ పాత్రకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు సుకుమార్. అలాగని మరో బలమైన విలన్ కూడా కనిపించలేదు. ఇదో డ్రా బ్యాక్ కూడా అని చెప్పుకున్నారు చాలామంది. అయితే ఈ పాత్రపై ముందు నుంచి ఫహాద్ కు అసంతృప్తి ఉంది. మధ్యలో కొన్ని క్లాషెస్ కూడా వచ్చాయి. కొన్నాళ్లు షూటింగ్ ఆగిపోయింది అనే వార్తలు కూడా వచ్చాయి..ఇదంతా ఆ కారణంగానే అనేవారూ లేకపోలేదు.
ఇక తాజాగా సినిమా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు బద్ధలు కొడుతోంది. ఇటు అల్లు అర్జున్ ను సొంత హీరోలా చూసుకునే కేరళ రాష్ట్రంలో ఓ కొత్త రచ్చ స్టార్ట్ అయింది. ఈ మూవీలో తన పాత్రకు ఫహాద్ డబ్బింగ్ చెప్పలేదు అని కొందరు.. చెప్పాడుఅని కొందరు వాదించుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సాగుతోన్న ఈ రచ్చకు ప్రధాన కారణం.. ఫహాద్ కు తన పాత్ర నచ్చలేదని.. అందుకే మళయాలంలో తను డబ్బింగ్ చెప్పడానికి ఇష్టపడలేదు అనేది వినిపిస్తోంది. బట్ కొందరు మాత్రం అది అతని వాయిసే అంటున్నారు. మరోవైపు ఫహాద్ లా మిమిక్ చేసే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించారనే వర్గం కూడా ఉంది.
నిజానికి ఫహాద్ ప్రొఫెషనల్ గా ది బెస్ట్ అంటారు. అలాంటి వాడు అలా చేయడు అనేది అతని గురించి తెలిసిన అందరికీ తెలుసు. ఇంకా చెబితే తనకు రాని తెలుగులోనే డబ్బింగ్ చెప్పుకున్నవాడు.. సొంత భాషలో చెప్పకుండా ఉంటాడా.. వీళ్లంతా ఏదో సౌండ్ తేడాగా ఉన్న థియేటర్స్ లో చూసి ఉంటారు.. అందుకే ఇలా అంటున్నారేమో అని ఇంకొందరంటున్నారు. మరి దీనిపై ఫహాద్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.