Bachhala Malli Song : అమ్మాయి కోసం అల్లరి నరేష్ హామీలు..
అల్లరి నరేష్ బచ్చల మల్లి మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల;
అల్లరి నుంచి నాంది నరేష్ గా మారిన తర్వాత నరేష్ స్క్రిప్ట్ సెలెక్షన్ మారింది. రిజల్ట్ ఎలా ఉన్నా.. బలమైన కథలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ మాస్ అవతారం ఎత్తాడు. బచ్చలమల్లిగా రాబోతున్నాడు. ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ మధ్య విడుదల చేసిన వీడియో గ్లింప్స్ సైతం ఆకట్టుకుంది. లేటెస్ట్ గా బచ్చలమల్లీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. నరేష్ సరసన హను మాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించిన ఈ పాటను శ్రీమణి రాశాడు. గౌర హరి, సింధూరి విశాల్ పాడారు.
కొత్తగా ప్రేమలో పడిన కుర్రాళ్లు అమ్మాయి కోసం ఏమైనా చేస్తాం అని అనేక రకాల హామీలిస్తుంటారు. ఆ హామీలనే చెబుతూ తను ప్రేమించిన, తనను ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తోన్న ఓ కుర్రాడి కోణంలో ఈ పాట కనిపిస్తోంది. శ్రీ మణి సాహిత్యం బావుంది. సంగీతం వినసొంపుగా ఉంది. మామూలుగా ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిల ఒంపు సొంపులను వర్ణిస్తూ సాహిత్యం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని మెరిట్స్ అన్నీ ఆమె కోసం ఏర్పాటు చేస్తా అంటూ రాయడం బావుంది. అందుకోసం అనేక హామీలు ఇస్తున్నట్టుగా ఉన్న లిరిక్స్ చాలా బావున్నాయి. ముఖ్యంగా రామసేతు లోని రాళ్లన్నీ తెచ్చి తన కోసం ఓ భవనం కడతా అని.. దానికి చేపలను కాపలా పెడతా అనడం ఇంకా బావుంది.
ఓ రకంగా నరేష్ కు ఈ మూవీ మంచి విజయం ఇచ్చేలానే కనిపిస్తోంది. టైటిల్ నుంచి ఈ పాట వరకూ ప్రతిదీ పాజిటివ్ గానే కనిపిస్తుంది. హాస్య సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీని సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేస్తున్నాడు.