సినిమాను వినోదాత్మకంగా చెప్పేవారు ఉన్నారు. సందేశాత్మకంగా చూపించేవారు ఉన్నారు. ఫిలసాఫికల్ గా చూపించేవారు మాత్రం అత్యంత అరుదు. ఇంక తెలుగులో మరీ అరుదు. ఈ కాలంలో అలాంటి దర్శకుడుగా కనిపిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంతోనే తన పంథా ఏంటో చెప్పకనే చెప్పాడు. డబ్బు వెనక పరుగులు పెడుతున్న మనిషి తనను తాను కోల్పోతున్న వైనాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా హృద్యంగా చెప్పే ప్రయత్నం చేశాడు. విజయం సాధించారు. రెండో సినిమాకే ఎవరూ చేయలేని సాహసం. మహానటి సావిత్రి బయోపిక్ రూపొందించాడు. సావిత్రి ఎంత గొప్ప నటి అనేది అందరికీ తెలుసు. వ్యక్తిగత జీవితంలో చేసిన చిన్న తప్పిదాలు ఆ మహానటి జీవితాన్ని ఎంత అతలాకుతలం చేశాయి అనే కోణాన్ని తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరించాడు.ఇందుకోసం ఇద్దరు జర్నలిస్ట్ లతో కథ నడిపించిన తీరు అతని బ్రిలియన్సీకి నిదర్శనం. ఇవాళ నాగ్ అశ్విన్ బర్త్ డే.
ఇక మూడో సినిమా కల్కి ఏడి 2898తో ముల్లోకాలూ చుట్టేశాడు. పైగా కాల యంత్రం కాన్సెప్ట్ తో వచ్చాడు. పైగా మూడో సినిమాకే ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ ను అమితాబ్, కమల్ హాసన్ వంటి వరల్డ్ క్లాస్ యాక్టర్స్ ను ఒప్పించాడు అంటే చిన్న విషయం కాదు. కల్కి 2898 కాలంలో సాగే కథగా చెప్పాడు. అక్కడి నుంచి మహా భారతానికి ముడి పెడుతూ.. ఇంద్రలోకం లాంటి కొత్త ప్రపంచాన్ని సృష్టించడమే కాదు.. కాశీ నగర విశిష్టతను అది కోల్పోబోతోన్న ప్రమాదాన్ని గుర్తించినట్టుగా హెచ్చరించాడు. కొన్ని మైనస్ లున్నాయి పండితులు చెప్పినా.. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయమే సాధించింది. త్వరలోనే కల్కికి సీక్వెల్ తో రాబోతున్నాడు నాగ్ అశ్విన్.
ఒక దర్శకుడుగా నాగ్ అశ్విన్ ఎంత ఫిలాసఫీని పండిస్తాడో.. వ్యక్తిగానూ అదే విలువలతో కనిపిస్తాడు. ఇది అరుదైన విషయం. కళారంగంలోని వ్యక్తుల జీవితాలు వెండితెరకు చాలా భిన్నంగా ఉంటాయి. నాగ్ అశ్విన్ అలా కాదు. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నా.. చిన్న కార్ లోనే తిరుగుతాడు. రీసెంట్ గా ఓ ఇంజినీరింగ్ కాలేజ్ కు గెస్ట్ గా వెళ్లాడు. అక్కడ వారితో మాట్లాడిన మాటలు, అతని సహనం, వ్యక్తిత్వం చూస్తే చాలు.. అతను పర్సన్ నూ ఎంత ఉన్నతుడో చెప్పడానికి.
సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కూతురు ప్రియాంక దత్ ను పెళ్లి చేసుకున్నాడు నాగీ. వీరికి రిషి అనే కొడుకు ఉన్నాడు. భార్య, భర్త ఇద్దరూ కలిసే సినిమా కోసం పనిచేస్తున్నారు. ప్రియాంక కూడా ఫిల్మ్ మేకింగ్ లో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పట్టా అందుకుంది. నిర్మాతగానూ అనుభవం ఉంది. ఇష్టమైన ఫీల్డ్ లో ఇద్దరూ విజయవంతంగా దూసుకుపోతున్నారు.
ఏదేమైనా నాగ్ అశ్విన్ కల్కి 2 కోసం కాలయాపన చేయకుండా మరిన్ని కొత్త కథలతో మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ ఈ అరుదైన దర్శకుడికి టివి5 ఎంటర్టైన్మెంట్ టీమ్ తరఫు నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు