మాస్ మహరాజ్ తో సినిమా అంటే అతని ఇమేజ్ కు మాత్రమే తగ్గట్టుగా ఉండాలని ప్రతి దర్శకుడు అనుకుంటాడు. అలా ఎందుకు ఉండాలి అని ఫస్ట్ మూవీతోనే మార్చే ప్రయత్నం చేశాడు హరీశ్ శంకర్. అతని ఫస్ట్ మూవీ షాక్.. రవితేజతోనే చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఎటెంప్ట్. కానీ వర్కవుట్ కాలేదు. అందుకే మళ్లీ మిరపకాయ్ అనే సినిమాతో రవితేజ మార్క్ ఎంటర్టైనర్ అందించి హిట్ కొట్టాడు. రవితేజ కూడా అప్పుడప్పుడూ కొత్త ప్రయత్నాలు చేసి లాస్ అయ్యాడు. అప్పటి నుంచి ఇమేజ్ కే స్టిక్ అయి ఉన్నాడు. అందుకే ఆగస్ట్ 15న రాబోతోన్న ‘మిస్టర్ బచ్చన్’ ను కూడా అలాగే రూపొందించారని లేటెస్ట్ గా వచ్చిన టీజర్ చూస్తే తెలుస్తుంది.
హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ 2018 హిందీ మూవీ ‘రైడ్’కి రీమేక్. అక్కడ అజయ్ దేవ్ గణ్, ఇలియానా నటించారు. ఇక్కడ రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. రైడ్ చాలా సీరియస్ గా ఉంటుంది. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ ఉన్నా.. అది చాలా మెచ్యూర్డ్ గానే ఉంటుంది. బట్ రీమేక్ లు చేసేటప్పుడు హరీశ్ శంకర్ చాలా మార్పులు చేస్తాడు కదా. ఈ టీజర్ చూస్తే ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ పూర్తిగా రవితేజ సినిమాలా కనిపిస్తోంది. పాటలు చూసి కొందరు విమర్శలు చేశారు. అయినా అవన్నీ నా ఇష్టం అనే పద్ధతిలోనే ఉన్నాడు హరీశ్.
రైడ్ ఓ రకంగా ఇంటెన్స్ డ్రామాలా కనిపిస్తుంది. బచ్చన్ అందుకు పూర్తి విరుద్ధంగా ఉండేలా ఉంది. రవితేజ మార్క్ ఫంకీనెస్ కాస్త ఎక్కువగానే ఉండేలా ఉంది. ఆ మధ్య సోషల్ మీడియాలో హరీశ్ ను ఒక అభిమాని ఈ రీమేక్ లు ఇంకెన్నాళ్లు అని అడిగితే.. బచ్చన్ చూశాక రీమేక్ అనిపిస్తే అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు. అది నిజమే అనేలా ఉంది టీజర్. బట్ ఒరిజినల్ చూసిన వారికి ఈ పాటలే పంటికింద రాయిలా ఉంటాయేమో.