నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న మూవీ తండేల్. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారీ చిత్రాన్ని. శ్రీకాకుళం జిల్లాలోని కొందరు జాలరుల జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలను ఆధారం చేసుకుని తెరకెక్కిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లడం.. వీరిని శతృవులుగా భావించిన పాక్ సైన్యం బంధించి హింసించడం.. భారత ప్రభుత్వ జోక్యంతో వారంతా సేఫ్ ఇండియా చేరడం అనేది గతంలో జరిగింది. దీనికే సినిమా టిక్ కోట్ ను యాడ్ చేసి.. కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్.. ఇంకాస్త దేశభక్తి అంశాలు జోడించి రూపొందిస్తున్నారని సినిమా అనౌన్స్ మెంట్ టైమ్ లో విడుదల చేసిన వీడియో గ్లింప్స్ తో చెప్పారు.
ఇక ఈ మూవీని డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తారనే ప్రచారం ముందు నుంచీ జరిగింది. తర్వాత సంక్రాంతికి పోస్ట్ పోన్ అన్నారు. రిపబ్లిక్ డే అనే మాటా వినిపించింది. రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్ కు బాగా డైలమాలో వేశారు. ఫైనల్ గా తండేల్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గానే ప్రకటించారు. చాలామంది ఊహించినట్టుగా ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తండేల్ రిలీజ్ డేట్ సస్పెన్స్ కు ఓ ఎండ్ కార్డ్ అయితే పడిందనే చెప్పాలి.