సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగుతో పాటు అనేక భాషల్లో స్టైలిష్ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముకుల్ దేవ్ కన్నుమూశాడు. ఆయన వయసు 54యేళ్లు. ఈయన ఎన్నో భాషల్లో టాప్ విలన్ అనిపించుకున్న రాహుల్ దేవ్ తమ్ముడు కావడం విశేషం. ఆ గుర్తింపుతోనే తనూ సినిమాల్లోకి వచ్చాడు. స్టైలిష్ గా కనిపిస్తూనే క్రూరమైన విలనీ పండించడం ముకుల్ దేవ్ స్టైల్. కూల్ గా కనిపించే వాడు. ఢిల్లీలో జన్మించిన ముకుల్, రాహుల్ దేవ్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవాళ్లు. రాహుల్ లాగా ఫిట్ నెస్ ఫ్రీక్ కాకపోయినా.. మంచి విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ముకుల్.
తెలుగులో రవితేజ హీరోగా నటించిన కృష్ణ మూవీతో పరిచయం అయ్యాడు. ఇందులో జక్కా పాత్రలో అదరగొట్టాడు. తర్వాత ఏక్ నిరంజన్, సిద్ధం,కేడీ, అదుర్స్, బెజవాడ, నిప్పు, భాయ్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, బెంగాలి, కన్నడ, గుజరాతీ, మళయాల భాషల్లో నటించాడు. వీటితో పాటు టివిల్లోనూ పలు షోస్, సీరియల్స్ లో నటించాడు. ఇన్ని భాషల్లో ఎంతో బిజీగా ఉన్న ముకుల్ దేవ్ 2019 తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఆ టైమ్ లో ఆయన తల్లి తండ్రులు చనిపోయారు. ఆ బెంగతో బాగా డిస్ట్రిబ్ అయ్యాడు అని చెబుతారు. 2022లో విడుదలైన ‘అంత్ ద ఎండ్’ ముకుల్ దేవ్ చివరి చిత్రం. ఆ తర్వాత అతను పూర్తిగా వెండితెరకు దూరమయ్యాడు. తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లాడట. ఈ క్రమంలో వైద్యం చేయించినా ఉపయోగం లేకపోయిందట. అలా ఈ శుక్రవారం(23.05.2025) కన్నుమూశాడు.