కుబేర.. ఈ మధ్య కాలంలో మోస్ట్ సెలబ్రేటెడ్ మూవీ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. మౌత్ టాక్ తో పాటు వసూళ్లు కూడా బావున్నాయి. అలాగే అన్ని రివ్యూస్ పాజిటివ్ గా వచ్చాయి. ఈ మూడూ కలవడం అసాధ్యం.. కానీ శేఖర్ కమ్ముల వల్ల సాధ్యం అయింది అంటూ ఆ మూవీ సక్సెస్ మీట్ లో శేఖర్ ను ఆకాశానికెత్తాడు నాగార్జున. నిజమే.. ఒక సినిమాకు సంబంధించి ఈ మూడు అంశాల్లోనూ పాజిటివిటీ కనిపించడం దాదాపు అసాధ్యం. దాన్ని సుసాధ్యం చేశాడు దర్శకుడు. మరి ఈ మూడు రోజుల్లో కుబేర సాధించిన వసూళ్లు నిజంగా వాళ్లు చెప్పినంత గొప్పగా ఉన్నాయా అంటే ఉన్నాయి అనే చెప్పాలి.
మూడు రోజుల్లో కుబేర చిత్రం 50 కోట్లు వసూళ్లు సాధించింది. శేఖర్ కమ్ములకు ఓవర్శీస్ లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ అక్కడ రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ వరకూ వచ్చింది. అంటే ఈ వీక్ డేస్ లో కాస్త స్ట్రాంగ్ గా ఉన్నా లాభాలు వచ్చినట్టే. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయిలో వసూళ్లు కనిపిస్తున్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి వసూళ్లు ఇలా ఉన్నాయి అని చెప్పడానికి లేదు. ఇదో కొత్త కథ. తెలుగు సినిమా మూస ధోరణికి భిన్నమైన కథ, కథనం ఉన్నాయి. స్టార్స్ ఉన్నా.. కేవలం పాత్రలుగా మాత్రమే కనిపించేలా చేసిన దర్శకత్వ నైపుణ్యం, అందుకు ఒప్పుకున్న స్టార్ హీరోల పెద్ద మనసు .. ఇలా అన్నిటి కలబోతగా ప్రేక్షకులకు ఓ కొత్త కథ చూసిన అనుభూతిని ఇస్తోంది. మరి ఈ వీక్ డేస్ కూడా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా మరింత విజయం సాధించే అవకాశం ఉంది.