Chiranjeevi : ఆ నిర్మాత చేసిన అవమానం మర్చిపోలేను

Update: 2025-01-06 09:15 GMT

మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడంటే సులువుగా ఈ మాట అనేస్తున్నారు. కానీ తన పేరు ముందు మెగాస్టార్ అనే ట్యాగ్ రావడానికి ఆయన ఎన్ని సాహసాలు చేశాడు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎన్నిసార్లు తనను తాను అప్డేట్ చేసుకున్నాడు.. అనేది చాలామందికి తెలియదు. కానీ ఇండస్ట్రీలో నటుడుగా నిలబడేందుకు.. స్టార్డమ్ తెచ్చుకునేందుకు ఈ చిరంజీవి అప్పుడు ఇప్పుడూ నిత్య తపస్సునే చేస్తున్నాడు అనేది నిజం. అయితే తన కెరీర్ ఆరంభంలో చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్న మెగాస్టార్.. తాజాగా అమెరిక‌న్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియ‌ష‌న్‌ (ఆప్త)బిజినెస్ కాన్ఫ‌రెన్స్ మీటింగ్‌లో తన కెరీర్ మొదట్లో జరిగిన ఓ అవమానాన్ని పంచుకుని భావోద్వేగానికి గురయ్యాడు.

అప్పట్లో తనకు ఎన్టీఆర్ తో పాటు తిరుగులేని మనిషి అనే సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. దేవీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇంత త్వరగా ఎన్టీఆర్ తో పాటు మరో హీరోగా నటించే ఛాన్స్ వచ్చిందని చిరంజీవి చాలా సంబరపడ్డాడట. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను అని కూడా చెప్పాడు. బట్ ఈ మూవీ ఫ్లాప్ అయిందట. అయినా తనకు మరోసారి ఎన్టీఆర్ తో పాటు హీరోగా నటించే అవకాశం వచ్చిందట. నిర్మాతలు తన డ్రెస్ కొలతలూ అవీ తీయించి పెట్టారట. డేట్స్ కూడా చెప్పారట. ఈ డేట్స్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇంకెవరికీ డేట్స్ ఇవ్వలేదు మెగాస్టార్. కట్ చేస్తే ఆ నిర్మాత నుంచి పిలుపు రావడం లేదట. దీంతో ఏదో కాస్త ఆలస్యం అవుతుంది అనుకున్న చిరంజీవికి.. ఆ మూవీలో తన ప్లేస్ లో మరో నటుడిని తీసుకున్నారు అని తెలిసిందట. ఆ సినిమా దర్శకుడు కూడా చాలా పెద్దవాడే అన్నాడు.

దీంతో చాలా బాధపడుతూ ఆ నిర్మాతను కలిసి అడిగితే.. గత చిత్రం ఫ్లాప్ అయింది కదా.. అందుకే ఈ సారి గ్లామర్ ఉండదు అని తీసేశాం. కానీ ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక ఇన్నాళ్లూ ఆగాం అన్నాడట. అరే ముందు చెబితే నా డేట్స్ వేరే వారికి ఇచ్చేవాణ్ని కదా.. ఇలా ఎందుకు చేశారు అని తెగ బాధపడిపోయిన చిరంజీవి.. తర్వాత ఆ అవమానాన్ని దిగమింగుకుని.. మరో సినిమా చేశాడు. కానీ కొన్నాళ్ల తర్వాత ఏ నిర్మాతైతే తనను తీసివేశాడో ఆ నిర్మాత కెరీర్ లో తనతోనే ఎక్కువ సినిమాలు నిర్మించేలా చేసుకున్నానని గర్వంగా చెప్పాడు. అంటే బాధపడుతూ కూర్చోలేదు. పని చేసుకుంటూ వెళ్లాను. అదే తనను ఇంత వాడిని చేసింది. మనసులో ఈగో పెట్టుకోలేదు. అందుకే ఆ నిర్మాతకు మళ్లీ అవకాశం ఇచ్చాను అని చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన కళ్లలో తెలియని గర్వం కనిపించింది. సో.. ఇలాంటివి ఎన్నో దాటాడు కాబట్టే.. ఇవాళ మెగాస్టార్ గా తిరుగులేని స్టార్ గా వెలుగుతున్నాడు.

Tags:    

Similar News