పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. దీంతో భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారం పాటు వాయిదా వేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్తతల మధ్య క్రికెట్ ఆడటం కరెక్టు కాదని.. ఇదే సమయంలో ఆటగాళ్ల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. ఐపీఎల్ 2025 మళ్లీ ఎప్పుడు పునఃప్రారంభం అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మరింత కాలం ఒత్తిడిని తట్టుకోవడం కష్టమని.. త్వరలోనే ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుందని జోస్యం చెప్పాడు.
ఆటగాళ్ల భద్రత కోసమే
భారత్ లో ప్రస్తుతం యుద్ధ తరహా వాతావరణం నెలకొందని.. ఈ కారణంతోనే బీసీసీఐ ఐపీఎల్ 2025 ఎడిషన్‌ను వారం పాటు వాయిదా వేసిందని గంగూలీ తెలిపాడు. ఇది మంచి నిర్ణయమని.. ఎందుకంటే ఈ టోర్నీలో భారత్‌తో పాటు.. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా ఉన్నారని తెలిపాడు. ఆటగాళ్ల భద్రత విషయంలో అస్సలు రాజీ పడకూడదన్న గంగూలీ.. తన దృష్టిలో త్వరలోనే ఐపీఎల్ 2025 పునఃప్రారంభం అవుతుందన్నాడు.. ఇప్పుడు టోర్నీ కీలక దశలో ఉందన్న కోల్ కత్తా ప్రిన్స్.... ధర్మశాల, ఢిల్లీ, జైపూర్, చండీగఢ్ లాంటి వేదికల్లో మ్యాచులు ఉన్నందున ప్రస్తుతం బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. త్వరలోనే పరిస్థితులు సెట్ అవుతాయని... ఎందుకంటే ఈ ఒత్తిడిని పాకిస్థాన్ ఎక్కువ కాలం తట్టుకోలేదని.. దానికి అంత సీన్ లేదని గంగూలీ వ్యాఖ్యానించాడు.
పాక్‌కు నో చెప్పిన యూఏఈ
పాక్ క్రికెట్ బోర్డుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025లో మిగిలిన మ్యాచ్‌లను UAEలో నిర్వహించాలన్న పాక్ అభ్యర్థనను తిరస్కరించింది. పీఎస్ఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పేసింది. బీసీసీఐతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు మంచి సంబంధాలున్నాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించడం వల్ల భారత్‌తో స్నేహం దెబ్బతినడంతో పాటు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తోంది.