మంచు ఫ్యామిలీ నుంచి బ్యాక్ టు బ్యాక్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. విష్ణు, మనోజ్. ఇద్దరూ మోహన్ బాబు స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. ఆయన నట వారసులుగా నిలవడంలో విఫలం అయ్యారు అనే చెప్పాలి. హీరోలుగా చాలా సినిమాలు చేసినా సక్సెస్ రేట్ చాలా తక్కువ. కొన్నాళ్ల క్రితం మనోజ్ నటనకు గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ లో పెళ్లి, విడాకులు, మళ్లీ పెళ్లి అంటూ ఓ ఎపిసోడ్ సాగింది. ఆపై తండ్రి, అన్నతో విభేదాలు అంటూ కొన్ని రోజులు హడావిడీ చేశాడు. కట్ చేస్తే మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. రీ ఎంట్రీలో భాగంగా మొదట వచ్చిన భైరవంతో సత్తా చాటాడు. కమర్షియల్ గా భైరవం ఎలాంటి రిజల్ట్ అందుకున్నా.. మనోజ్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో పాజిటివ్ గా మొదలై నెగెటివ్ టర్న్ తీసుకునే పాత్రలో మెప్పించాడు.
ఇక ఇప్పుడు మిరాయ్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇందులో అతనే మెయిన్ విలన్. ఇప్పటి వరకూ మనోజ్ హీరోగానే ప్రయత్నించాడు. ఈ ఇన్నింగ్స్ లో వరుసగా నెగెటివ్ రోల్స్ తో వస్తుండటంతో అతని జర్నీ ఎటు వెళుతుంది అనే చర్చలు సాగుతున్నాయి. అంటే హీరోగా చేయాలనే ఫిక్స్ అయితే ఆ కథ వేరే ఉంటుంది. ఇలా వచ్చిన పాత్రలన్నీ చేస్తూ వెళితే హీరోగా ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కష్టమే అవుతుంది. మిరాయ్ లో హీరోకు సమానంగా తన పాత్ర ఉంటుందనే నమ్మకంతో ఉన్నాడు. ఈ పాత్ర తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెస్తుందని కూడా ఆశిస్తున్నాడు. పైగా ఇంటి నుంచి సపోర్ట్ లేదు కాబట్టి.. తనకు అభిమానులే అన్నీ అంటూ ప్రమోషన్స్ లో చెబుతున్నాడు. అలాంటి అభిమానులను అలరించాలంటే హీరోగానే సాధ్యం అవుతుంది. విలన్ ఆ ఫ్యాన్స్ ను కొనసాగించుకోవడం అంత సులువేం కాదు. గతంలో మోహన్ బాబు, శ్రీ హరి లాంటి వారికే అది సాధ్యం అయింది.
ఏదేమైనా మిరాయ్ బ్లాక్ బస్టర్ అయితే మనోజ్ కు విలన్ గానే ఎక్కువ ఆఫర్స్ వస్తాయి. పైగా ప్రస్తుతం కొన్ని సినిమాల్లో హీరోగానూ చేయబోతున్నాడు. వీటిపైనా మిరాయ్ బ్లాక్ బస్టర్ ప్రభావం పడుతుంది. అంచేత హీరోగా నటించే సినిమాల ఓపెనింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో.. ప్రస్తుతం అతను హీరోగానా, విలన్ గానా అనేది తేల్చుకుంటే.. బెటర్ అవుతుంది. లేదా మిరాయ్ లో తన పాత్రకు వచ్చే అప్లాజ్ ను బట్టి ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటే అది వేరే సంగతి.