దళపతి విజయ్ హీరోగా నటిస్తోన్న మూవీ 'జన నాయగన్'. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ రోర్ అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని కర్ణాటకకు చెందిన కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. పూజాహెగ్డే ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇవాళ (ఆదివారం) విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ ఫస్ట్ రోర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మామూలుగానే విజయ్ సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటిది ఇది అతని చివరి సినిమా కావడంతో మరింత క్రేజ్ కనిపిస్తోంది. అర్థరాత్రి విడుదల చేసినా కోట్లలో వీక్షించడం విశేషం.
'నిజమైన నాయకుడు అధికారం కోసం కాదు.. ప్రజల కోసం వస్తాడు' అనే క్యాప్షన్ తో స్టార్ట్ అయిన వీడియో మొత్తం విజయ్ ని హైలెట్ చేస్తూ సాగింది. విశేషం ఏంటంటే.. ఇది తెలుగులో వచ్చిన బాలకృష్ణ భగవంత్ కేసరికి ఇది రీమేక్ అనే మాట బలంగా వినిపించింది. అందుకు తగ్గట్టుగానే శ్రీ లీల పాత్రలో ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటిస్తోంది. అయితే భగవంత్ కేసరిలోని మెయిన్ పాయింట్ ను తీసుకుని విజయ్ ఇమేజ్ కు అనుగుణంగా, అతని పొలిటికల్ స్ట్రాటజీ హైలెట్ అయ్యేలా ఈ చిత్రాన్ని మలచబోతున్నారని చెబుతున్నారు. అయితే పాత్రలను పెద్దగా మార్చలేదని అర్థం అవుతోంది. భగవంత్ కేసరిలో బాలయ్య పోలీస్. ఇందులోనూ విజయ్ పోలీస్ ఆఫీసర్ గానే నటిస్తున్నాడని ఈ వీడియోతో తేలిపోయింది. ఆ టైటిల్ చూసిన చాలామంది పొలిటీషియన్ పాత్రలో కనిపిస్తాడు అనుకున్నారు. బట్ ఆయన పోలీస్ గా కనిపించడం.. ఆ ఖాకీ డ్రెస్ లో కత్తి పట్టుకుని అల్లర్లు జరుగుతున్న ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చినట్టుగా కనిపిస్తోందీ వీడియో. మొత్తంగా జన నాయగన్ తో విజయ్ కూడా ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడని ఈ వీడియోతో తేల్చారు. అన్ని సౌత్ లాంగ్వేజెస్ తో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అలాగే సినిమాను 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.