1972లో వచ్చిన పండంటి కాపురంతో నటిగా పరిచయం అయింది జయసుధ. ఈ చిత్రంలో తనది జమున కూతురు పాత్ర. కొన్నాళ్ల పాటు ఇలాంటి రోల్స్ లోనే ఆకట్టుకుంది. ఆపై 1975లో లక్ష్మణ రేఖ సినిమాతో ‘హీరోయిన్’మారింది. ఈ సినిమా 1975 సెప్టెంబర్ 12న విడుదలైంది. అంటే నేటికి సరిగ్గా 50యేళ్లు. జయసుధ కూ హీరోయిన్ గా 50యేళ్లు పూర్తయ్యాయన్నమాట. ఈ సినిమా తర్వాత తనదైన అభినయంతో "సహజనటి" గా తిరుగులేని కెరీర్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రంతో దర్శకుడిగా మారిన గోపాలకృష్ణ ఇంటిపేరు "లక్ష్మణరేఖ"గా మారిపోయింది. అప్పటి రోజులకు విప్లవాత్మకం అనదగ్గ వినూత్న కధాంశంతో తెరకెక్కిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో మురళీమోహన్ - జయసుధ జంటగా నటించారు. చంద్రమోహన్ నెగటివ్ షేడ్స్ కలిగిన ముఖ్య పాత్రలోనూ.. గుమ్మడి, అల్లు రామలింగయ్య ప్రభృతులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అప్పటి సంగీత సంచలనం సత్యం సంగీత సారధ్యం వహించారు. ఎ. వి. కె. ప్రొడక్షన్స్ పతాకంపై షణ్ముగం చెట్టియార్ - కృష్ణారావు సంయుక్తంగా నిర్మించారు.
ఈ చిత్రం విడుదలై 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా "లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ" మాట్లాడుతూ... "ఈ చిత్రం కోసం జయసుధను ఎంపిక చేయడాన్ని పలువురు పెద్దలు ఓపెన్ గానే క్రిటిసైజ్ చేశారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా... అందునా కొత్త దర్శకుడితో చేస్తూ... లేనిపోని రిస్క్ చేస్తున్నారని నిర్మాతల్ని భయపెట్టారు కూడా. కానీ నా మీద, నా సబ్జెక్ట్ మీద నమ్మకంతో నా నిర్మాతలు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లారు. వాళ్ళు చేసిన రిస్క్ ఫలించి, టేబుల్ ప్రాఫిట్ గా "లక్ష్మణరేఖ" నిలిచి... నా ఇంటిపేరుగా మారిపోయింది. ఏరియాల వారిగా బిజినెస్ జరుపుకున్న మొట్టమొదటి చిత్రంగానూ దర్శకుడిగా నా పరిచయ చిత్రం చరిత్ర సృష్టించడం పట్ల నేను ఇప్పటికీ గర్వపడుతుంటాను" అన్నారు.