Kamal Haasam-Rajinikantah : అఫీషియల్.. 46 ఏళ్ల తర్వాత కమల్, రజనీకాంత్..
ప్రఖ్యాత నటులు కమల్ హాసన్, రజనీకాంత్ 46 ఏళ్ల తర్వాత ఒక సినిమాలో కలిసి నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. ఈ విషయం చాలా కాలంగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు కమల్ హాసన్ స్వయంగా దీనిని ధృవీకరించారు. దుబాయ్‌లో జరిగిన నెక్సా సైమా అవార్డ్స్ 2025 వేడుకలో కమల్ హాసన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. తాను, రజనీకాంత్ కలిసి ఒక ప్రాజెక్ట్‌లో పని చేయనున్నామని తెలిపారు. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ గతంలో కమల్ హాసన్‌తో "విక్రమ్", రజనీకాంత్‌తో "కూలీ" చిత్రాలను రూపొందించి భారీ విజయాన్ని సాధించారు. ఈ ఇద్దరు దిగ్గజ నటులతో కలిసి ఒక సినిమా చేయాలని ఆయన ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. 1970లలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి 20కి పైగా సినిమాల్లో నటించారు. "అపూర్వ రాగంగళ్", "మూండ్రు ముడిచు" వంటి చిత్రాలు ఇందులో ఉన్నాయి. 1979లో వచ్చిన "అల్లాయుద్దీన్ అద్భుత దీపం" సినిమా తర్వాత వారు కలిసి నటించలేదు. ఈ సినిమా గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ, "వ్యాపారపరంగా ఇది ఆశ్చర్యకరంగా ఉండవచ్చు, కానీ మాకు మాత్రం కాదు. చాలా కాలం క్రితం జరగాల్సిన విషయం ఇప్పుడు జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది" అని అన్నారు. తమ ఇద్దరి మధ్య ఎప్పుడూ పోటీ భావన లేదని, అభిమానులు, మీడియానే దానిని సృష్టించాయని ఆయన స్పష్టం చేశారు.