Kangana Ranaut : మోనాలిసాను గుర్తించినట్టు కొత్త హీరోయిన్లనూ గుర్తించండి : కంగనా
కుంభమేళాలో రుద్రాక్షలు, దండలు అమ్ముకుంటున్న మోనాలిసాను గుర్తించినట్టు కొత్త హీరోయిన్లను ఎందుకు గుర్తించరంటోంది కంగనా రనౌత్. ఆమె నటించిన ఎమర్జెన్సీ మూవీ పలు వివాదాల మధ్య ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఎప్పడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ నటి, ఎంపీ కంగన్ రనౌత్ మోనాలిసా విషయంలో ఇన్ స్టా వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తన సహజ సౌందర్యంతో ఇంటర్నెట్ లో సంచలనంగా మారిన మోనాలిసాతో ఫొటోలు దిగేందుకు కొందరు ప్రవ ర్తించిన తీరు తనను బాధించిందని తెలిపింది. తాను వారిని ద్వేషించడం తప్ప ఏమీ చేయలేనని అంటోంది. ఇండస్ట్రీలో ఆమె రంగులో ఉన్న హీరో యిన్లు ఎంతోమంది ఉన్నారని వారందరినీ మీరు ఇలానే అభిమానిస్తున్నారా? అని ప్రశ్నించింది. కాజోల్, దీపికా పదుకొణె వంటి నటీమణులపై చూపిన ప్రేమాభిమానాలే కొత్త హీరోయిన్లపై కూడా చూపిస్తున్నారా? అని ప్రశ్నించింది.
మధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలో ఉన్న మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది. అక్కడ రుద్రాక్ష దండల అమ్ముతూ కనిపించిన ఆ యువతిని అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి.