తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు అంశంపై జరుగుతున్న చర్చలు కొలిక్కి వస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్‌ల మధ్య జరిగిన కీలక సమావేశంలో వేతనాలు పెంచుతామని ఛాంబర్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. మూడు యూనియన్లకు కూడా వేతన పెంపు వర్తిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ..'9 టు 9 కాల్‌షీట్' విధానంపై కూడా చర్చ జరిగింది. ఈ విధానాన్ని అమలు చేయడానికి ఫెడరేషన్ నేతలను ఒప్పించేందుకు ఛాంబర్ ప్రయత్నించింది.
ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని మీడియాతో మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్ తమ సమస్యలను అర్థం చేసుకుందని, వేతనాల పెంపునకు అంగీకరించిందని వెల్లడించారు. మరోసారి నిర్మాతలతో చర్చించిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. కాగా చర్చల వివరాలను నటుడు చిరంజీవికి ఫోన్ ద్వారా తెలియజేస్తున్నామని అనిల్ తెలిపారు. అలాగే, తెలంగాణను సినిమా హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినందుకు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినట్లు చెప్పారు. ఈ చర్చలు సినీ కార్మికుల హక్కుల కోసం ఒక కీలక మలుపుగా మారాయి.