పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న మూవీ హరిహర వీరమల్లు. చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నారు.క్రిష్ తర్వాత ఇప్పుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేశారు.ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తోన్న హరిహర నుంచి ఆల్రెడీ వచ్చిన మాట వినాలి పాట ఆకట్టుకుంది. ఇది హీరోయిన్ ను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయిన వీరమల్లుడి మనోగతం నుంచి వచ్చే పాటలా ఉంది. చంద్రబోస్ రాశాడు. రాహుల్ సిప్లిగంజ్, మంగ్లి, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల పాడారు. కీరవాణి నుంచి మరసారి ఓ మంచి ట్యూన్ వచ్చింది. వినగానే ఆకట్టుకునేలా ఉందీ పాట. ముఖ్యంగా చంద్రబోస్ సాహిత్యం కథనంతో పాటగా కదిలినట్టు కనిపిస్తోంది. అంటే అతని మనోగతాన్ని ప్రశ్నించేవారు, దానికి అతను సమాధానం చెప్పే తీరు అన్నట్టుగా ఉంది సాహిత్యం.
'కొండాపల్లి ఎండీబొమ్మా.. కోలాకళ్లతో చూసిందమ్మా.. తీయా తియని తేనెల బొమ్మ.. తీయని తెరలే తీసిందమ్మా.. వజ్రాల జిలుగులున్న.. రత్నాల ఎలుగులున్న.. కెంపుల్లో ఒంపులున్నా.. పోరీల మెరుపులున్నా.. నా పైడి గుండెలోన ఏడి పుట్టించి.. కొల్లగొట్టినాదిరో ' అంటూ మొదలైన పాటలో.. చంద్రబోస్ సాహిత్యపులు బలే అనిపిస్తాయి.
'కన్నులలోని కాటు మేఘం సీకటి నాపై సిలికిందే.. మాటలతోనే మెలికేసిందో మర్మం ఏదో దాసిందే..' అని అతనంటే.. 'ఆడవాళ్ల మనసు తీరు అడివిలాంటిదని ఎరగని సెంద్రుడివా.. అంత అమాయకుడివా.. ' అంటూ పక్కనే ఉన్న ఆడవాళ్లు ఆటపట్టిస్తుంటారు. ఇలా పాటంతా సాగుతూనే ఉంటుంది. ఏం చేసినా ఆమెను చూడగానే తన మనసు కొల్లగొట్టిందని ఆమెకే తెలిసేలా కథానాయకుడు పాడుకున్న పాట ఇది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న సినిమా కాబట్టి సంగీతం, సాహిత్యం సమపాళ్లలో సాగుతూ.. అభిమానులతో పాటు ఆడియన్స్ ను కూడా అలరించేలా ఉన్నాయి.
ఇక ఈ పాటలో నిధి అగర్వాల్ ను చూస్తూ పవన్ పాడుకున్నా.. మెయిన్ డ్యాన్స్ అంతా అనసూయ, పూజిత పొన్నాడలతోనే ఉంది. అన్నట్టు పవన్ కూడా ఒక స్టెప్ వేశాడు. ఇక రాబోయే రోజుల్లో ఆ ఒక్క స్టెప్ తో ఎన్ని రీల్స్ వస్తాయో చూడాలి.