Krishnam Raju : ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతుల మీదగా కృష్ణంరాజు అంతిమ సంస్కారాలు ..
Krishnam Raju : ప్రముఖ నటులు కృష్ణంరాజు అంత్యక్రియలు మరి కొన్ని గంటల్లో జరుగనున్నాయి. కుటుంబ పండితుల సూచనలతో కృష్ణంరాజు అంత్యక్రియల్లో స్వల్ప మార్పులు చేశారు.;
Krishnam Raju : ప్రముఖ నటులు కృష్ణంరాజు అంత్యక్రియలు మరి కొన్ని గంటల్లో జరుగనున్నాయి. కుటుంబ పండితుల సూచనలతో కృష్ణంరాజు అంత్యక్రియల్లో స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్ నుంచి కృష్ణంరాజు అంతిమయాత్ర మొదలవనుంది. మొయినాబాద్ కనకమామిడిలోని బ్రౌన్‌టౌన్ రిసార్ట్‌లో.. ఈ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి.
ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతుల మీదగా అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రెబల్ స్టార్ మన మధ్య లేరనే వార్తను ఇప్పటికీ చాలా మంది అభిమానులు, ఆప్తులు, కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కృష్ణం రాజును కడసారి చూసేందుకు ఫ్యాన్స్ హైదరాబాద్‌కు తరలి వస్తున్నారు. నివాళులర్పించేందుకు.. అభిమానులకు అనుమతిస్తున్నారు. నిన్న కన్నుమూసిన ఆయన భౌతిక కాయాన్ని బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖల సందర్శనార్ధం సొంత నివాసంలో ఉంచారు. అభిమానుల సందర్శన తర్వాత ఈరోజు మధ్యాహ్నం కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభంకానుంది.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా మధుమేహం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితోపాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏడాది కిందట మధుమేహం కారణంగా ఆయన పాదం కూడా తొలగించారు. ఇటీవల కొవిడ్ సోకడంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కోలుకొని ఇంటికి చేరుకున్నా.. పోస్టు కొవిడ్ సమస్యలు తలెత్తాయి. ఆగస్టు 5న తీవ్ర ఆయాసంతో మళ్లీ ఏఐజీలో చేరారు. గత 27 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ చివరకు సెప్టెంబర్ 11 ఆదివారం తెల్లవారు జామున ప్రాణాలు విడిచారు.