Lata Mangeshkar: కన్నుమూసిన గాన కోకిల.. అభిమానుల కన్నీటి వీడ్కోలు..
Lata Mangeshkar: గత నెల మొదటి వారం నుంచి హాస్పిటల్‌లోనే ఉన్న లతా మంగేష్కర్ ఇవాళ తుది శ్వాస విడిచారు.;
Lata Mangeshkar (tv5news.in)
Lata Mangeshkar: గాన కోకిల లతా మాంగేష్కర్ కన్నుమూశారు. గత నెల మొదటి వారం నుంచి హాస్పిటల్‌లోనే ఉన్న లతా మంగేష్కర్ ఇవాళ తుది శ్వాస విడిచారు. కరోనాతో గత నెల 8న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ట్రీట‌్మెంట్ తీసుకుంటున్నారు. మధ్యలో లతా మంగేష్కర్ ఆరోగ్యం కుదుటపడ్డట్టు డాక్టర్లు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆమె కోలుకున్నట్టేనని సంబరపడ్డారు అభిమానులు. కాని, అంతలోనే మళ్లీ ఆరోగ్యం విషమించింది.
బాలీవుడ్‌లో ఫిమేల్ సింగర్ అంటే లతా మంగేష్కరే. హిందీ పాటలపై, హిందీ సినీ జగత్తుపై చెరపలేని ముద్ర వేశారు లతా. కేవలం హిందీలోనే కాదు.. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారు. అందుకే, లతా మంగేష్కర్‌కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. 1948 నుంచి 1978 వరకు 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించారు.
ఆ తరువాత మరో 20వేలకు పైగా పాటలు పాడారు. తెలుగులో సంతానం సినిమాలోని నిదురపోరా తమ్ముడా, ఆఖరి పోరాటం సినిమాలోని తెల్లచీరకు అనే పాటలు పాడారు. సాధి మనసే సినిమాకు లతా మంగేష్కర్ అందించిన సంగీతానికి ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్నారు.
ఐదవ ఏటనే తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నారు లతా మంగేష్కర్. ఆ వయసులోనే సంగీతం వినడం, పాటలు పాడడం తప్ప మరో లోకం లేదు. చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువగా ఇంట్రస్ట్ చూపడంతో చివరికి సంగీతంలోనే స్థిరపడిపోయారు. లతా మంగేష్కర్ పార్థివదేహాన్ని చూసేందుకు అభిమానులకు మధ్యాహ్నం రెండు గంటల వరకే అవకాశం కల్పించారు. బ్రీచ్‌కాండీ ఆస్పత్రి నుంచి లతా మంగేష్కర్ భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 12:30కి ముంబైలోని ఆమె స్వగృహానికి తరలించారు.
సాయంత్రం ఆరున్నరకు శివాజీ పార్కులో లతా మంగేష్కర్ పార్థీవదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించారు సచిన్ టెండూల్కర్. బ్రీచ్ కాండీ ఆస్పత్రికి వెళ్లి లతా పార్థివదేహాన్ని సందర్శించారు.