Jakir Hussain : ఆగిపోయిన ‘డ్యాన్సింగ్ ఫింగర్స్’

Update: 2024-12-16 09:30 GMT

కళాకారులు తాము ఎంచుకున్న కళ ద్వారా ఎదుగుతారు. కానీ కొందరు మాత్రమే ఆ కళ ఒక వన్నె తెస్తారు. ఆ కళ కూడా వారి చేతిలో ఒదిగిపోతుంది. పలికిందల్లా, పట్టిందల్లా సంగీతమే అవుతుంది. అలాంటి అద్భుతాన్నే ఆవిష్కరించిన ఇండియన్ తబలా లెజెండ్ జాకీర్ హుస్సేన్ చేతి వేళ్లు శాస్వతంగా నిష్క్రమించాయి. మెరుపు వేగంతో తబలాపై ఆయన చేసిన విన్యాసాలకు విస్తుపోవడం ప్రేక్షకుల వంతైంది. ఆ ప్రతిభతోనే భారతీయ సినిమా సంగీతంలో జాకీర్ హుస్సేన్ అన్న తన పేరును అజరామరంగా చేసుకున్నాడు. కళలతో అమరత్వం పొందిన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, హరి ప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ తరహాలో ఆజన్మాంతం కళకే అంకితమైన అరుదైన కళాకారుడు జాకీర్ హుస్సేన్.

ఆ చేతి వేళ్లలో సంగీతం దాగుంది.. ప్రతి సంగీతాక్షరం ఆయన తబలాపై పలికింది.. జుగల్ బందీ అయినా.. సోలోగా అయిన ఆ వేళ్లు కదులుతుంటే.. కనురెప్పలు కూడా మూయకుండా చూశారు ప్రేక్షకులు. పాశ్చత్య సంగీతం భారతీయ సంగీత వాయిద్యాలపై పెను ప్రభావం చూపించినా.. మనదైన సాంస్కృతిక సంగీత వాయిద్యమైన తబలతో ప్రపంచాన్నే విస్తుపోయేలా చేసిన ది రియల్ లెజెండ్ జాకీర్ హుస్సేన్. కళ్లు, ఒళ్లు మైమరచిపోయి జులపాల జుత్తును అదే పనిగా విసురుతూ.. ఆనంద పారవశ్యంలో తబలాపై ఆయన వేళ్లు విన్యాసం చేస్తుంటే.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవు అంటారు. ఆయన తబలాపై విన్యాసం చేస్తుంటే.. ఆ వేళ్లు చూసిన వాళ్లు.. ‘డ్యాన్సింగ్ ఫింగర్స్’అని పేరు పెట్టుకున్నారు.

మూడేళ్ల వయసు నుంచి ఆయన తండ్రి జాకీర్ కు సంగీతం నేర్పించాడు. అలా తబలాపై ఆ పసి చేతులతోనే తన ఆత్మను ఆవిష్కరించుకుని అదే జీవితంగా మలచుకున్న మేధావి జాకీర్. 11 యేళ్ల నుంచే జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరాడంటే కళపై అతని ఆరాధన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఎంత గొప్ప సంగీతకారుడో.. అంత గొప్ప సంస్కారి. విన్యాసం, వ్యక్తిత్వం కలబోత జాకీర్ హుస్సేన్. అలాంటి కళాకారులు అత్యంత అరుదు.

1951 మార్చి 9న జన్మించిన జాకీర్ హుస్సేన్.. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. అక్కడే 2024 డిసెంబర్ 16న ఉదయం తెల్లవారు ఝామున కన్నుమూశారు.

ఆయనకు భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారాన్నీ, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2023లో పద్మవిభూషణ్‌ అందజేసింది. 1990 లో భారత దేశపు జాతీయ సంగీత, నాట్య, నాటక సంస్థ సంగీత నాటక అకాడెమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. 1999 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆయనకు ఆ దేశంలో సాంప్రదాయ కళాకారులకు, సంగీత విద్వాంసులకు ఇచ్చే నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో సత్కరించింది. 2009లో గ్రామీ పురసస్కారం అందుకున్నారు.

కోట్లమందిని రంజింప చేసి కోట్లాదిమందికి సంగీతంపై ప్రేమ కలిగేలా చేసిన జాకీర్ హుస్సేన్ మరణంతో దేశం ఓ గొప్ప సంగీత కళాకారుడిని కోల్పోయింది.

Tags:    

Similar News