MISS ENGLAND: నన్ను వేశ్యలా చూశారు: మిస్ ఇంగ్లాండ్‌

మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు;

Update: 2025-05-25 05:00 GMT

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలపై మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేశారు. మిస్‌ వరల్డ్‌ పోటీలు గతంలోలాగా కాకుండా భిన్నంగా ఉంటాయని అనుకున్నానని.. కానీ కోతుల ప్రదర్శనలా కూర్చోవాల్సి వచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. పోటీలకు స్పాన్సర్‌ చేస్తున్న మధ్య వయసు పురుషులతో కలివిడిగా మెలగాలని, వారితో కూర్చొని మాట్లాడాలని పోటీల నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారని.. తనను వేశ్యలా చూస్తున్నట్టు అనిపించిందని వ్యాఖ్యానించారు. అందుకే మిస్‌ వరల్డ్‌ పోటీ నుంచి తప్పుకొన్నానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

దిసన్ ఇంటర్వ్యూలో...

హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలనడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యా’ అంటూ మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణపై గౌరవం పెరిగిందని, అతిథ్యం బాగుందని మెచ్చుకుంటూనే మేం పోటీలకు వచ్చామో, దేనికొచ్చామో అర్థం కాలేదు.. ఇవేం పోటీలని పేర్కొన్నారు. ప్రపంచ సుందరి-2025 పోటీల నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన ఆమె ఇంగ్లాండ్‌ చేరిన తర్వాత బ్రిటన్‌కు చెందిన ‘ది సన్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. పోటీదారులంతా 24 గంటల పాటు మేక్‌పలో ఉండాలని, రోజంతా బాల్‌ గౌన్‌లను ధరించే ఉండాలని నిర్వాహకులు చెప్పారు. ఉదయం అల్పాహారం సమయంలోనూ అలాగే ఉండాలన్నారు. మిస్‌ వరల్డ్‌ పోటీలకు స్పాన్సర్‌ చేసిన మధ్య వయసు పురుషులకు కృతజ్ఞత చూపాలని, వారితో కలివిడిగా ఉండాలని చెప్పారు. ఒక్కో టేబుల్‌ వద్ద ఆరుగురు అతిథులతో ఇద్దరు చొప్పున పోటీదారులను కూర్చోబెట్టారు. గంటలకు గంటలు వారిని అలరిస్తూ కూర్చోవడం తీవ్ర వేదనను మిగిల్చిందన్నారు. ఆమె ఈ నెల 16వ తేదీనే పోటీల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించి, ఇంగ్లండ్‌కు వెళ్లిపోయారు. ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ కింద నేను ఎంచుకున్న అంశాన్ని వివరించేందుకు ప్రయత్నించాను. కానీ టేబుల్‌ వద్ద ఉన్న పురుషులెవరూ పట్టించుకోలేదు. ఏవో సరదా మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేశారు. 74 ఏళ్ల మిస్‌ వరల్డ్‌ పోటీల చరిత్రలో ఇలా మిస్‌ ఇంగ్లండ్‌ తప్పుకోవడం ఇదే మొదటిసారి. ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ అన్న భావనే లేకుండా పోయింది. మిస్‌ వరల్డ్‌ పోటీలు మారాల్సి ఉంది’’ అని మిల్లా మాగీ పేర్కొన్నారు.

ఖండించిన మోర్లే

మోర్లే ఆరోపణలను మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ సీఈవో జూలియా మోర్లే ఖండించారు. ఆ వాదనలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సైతం తోసిపుచ్చారు. తన తల్లి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేదని, పోటీల నుంచి విరమించుకుని వెళ్లిపోతానని మిల్లా మాగీ కోరారని మోర్లే చెప్పారు. ఆమె కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా పరిగణించి.. వెంటనే ఆమెను ఇంగ్లండ్‌కు తిరిగి పంపే ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Tags:    

Similar News