వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ స్వయంగా ముందుకొచ్చారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శనివారం వయనాడ్ జిల్లాలోని చూరల్‌మాల, ముండకై గ్రామాలను గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో మోహన్‌లాల్ సందర్శించారు. ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాలంటీర్లు, పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు, అధికారుల కృషిని మోహన్‌లాల్ అభినందించారు.