అదృష్టం, దురదృష్టం చెరో 25 -75 శాతం ఉన్న హీరో నితిన్. ఒక్క హిట్టు పడితే వరుస ఫ్లాపులు వస్తుంటాయి. ఈ ఫ్లాపులు తట్టుకుంటూ ఇన్నేళ్లుగా కెరీర్ లాగిస్తున్నాడంటే అతనికంటే అదృష్టవంతుడు ఇంకెవరుంటారు. అయితే పాపం రాబిన్ హుడ్ పై మాత్రం భారీ ఆశలు పెట్టుకున్నాడు. రెట్టించిన ఉత్సాహంతో ప్రమోషన్స్ చేశాడు. అతని ఊపు చూసి రాబిన్ హుడ్ బ్లాక్ బస్టర్ అయిపోయినట్టే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. వెంకీ కుడుములతో అంతకు ముందు చేసిన భీష్మ అతని చివరి హిట్. దీంతో మరోసారి అతనే హిట్ ఇస్తాడు అనుకుంటే ఇది భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఇక ఇప్పుడు అతని నెక్ట్స్ టార్గెట్ ‘తమ్ముడు’మూవీపై ఉంది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నిన్నటి హీరోయిన్ లయ నితిన్ కు అక్కగా రీ ఎంట్రీ ఇస్తోంది. అక్కా, తమ్ముడు బాండింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని గతంలోనే చెప్పారు. టైటిల్ చూసినా తెలుస్తుంది. దీంతో పాటు అథ్లెటిక్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందని టాక్. రాబిన్ హుడ్ పోయిన తర్వత నితిన్ డల్ అయ్యాడు. బాగా డీలా పడిపోయాడు అంటున్నారు. బట్ చాలా తక్కువ టైమ్ లోనే మరోసారి ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు రావాల్సి ఉంది. అందుకు కారణం ‘తమ్ముడు’ మూవీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయింది.
తమ్ముడు చిత్రాన్ని జూలై 4న విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ.. ఆల్మోస్ట్ ఈ డేట్ కే తమ్ముడు వస్తున్నాడు అని చెబుతున్నారు. నిజానికి ఈ మూవీ రాబిన్ హుడ్ డేట్ లోనే రావాలి. కానీ రాబిన్ హుడ్ ను రెండు మూడుసార్లు వాయిదా వేయడం వల్ల తమ్ముడు కూడా పోస్ట్ పోన్ కాక తప్పలేదు. అందుకే మరీ లేట్ అయితే ఇది కూడా రాబిన్ హుడ్ తరహాలో ఆడియన్స్ మైండ్ లో లైట్ అయిపోతుందనుకున్నారేమో.. జూలై 4న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
నితిన్ .. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని అందరికీ తెలుసు. అలాంటి పవన్ బ్లాక్ బస్టర్ అయిన తమ్ముడు టైటిల్ ను ఇతను రిపీట్ చేస్తున్నాడు. కంటెంట్ పరంగా వేర్వేరు అయినా.. టైటిల్ అదే కదా. మరి ఈ టైటిల్ తో వస్తోన్న మూవీ అయినా నితిన్ కు ఓ సాలిడ్ కమ్ బ్యాక్ గా నిలుస్తుందేమో చూడాలి.