ముంబై మేయర్ బరిలో సోనూసూద్.. పొలిటికల్ ఎంట్రీపై రియల్ హీరో క్లారిటీ
Sonu Sood: లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని మరి వారికి సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు సోనూసూద్.;
కరోనా లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని మరి వారికి సాయం చేసి రియల్ హీరోగా నిలిచారు రీల్ విలన్ సోనూసూద్. కరోనా తొలి నాళ్లలో లాక్‌డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మిలకు సోనూసూద్ సొంత ఖర్చులతో ఇళ్లకు పంపించారు. అప్పటి నుంచి ఎవరి ఏ కష్టమొచ్చిన తన వంతు సాయం చేస్తున్నాడు. అయితే సోనూసూద్ త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బి.ఎం.సి)2022లో ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా సోనూసూద్ పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున సోనూసూద్ పోటీ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోనూసూద్ తో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావు దేశ్‌ముఖ్ తనయుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్, మోడల్, ఫిట్‌నెస్ పర్సనాలిటీ మిలింద్ సోమన్ నిలిచారని ఊహాగానాలు వచ్చాయి. కాంగ్రెస్ ఈ సారి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది.
సోనూసూద్ ఈ విషయంపై స్పందించారు. ఇలాంటి వార్తల్లో నిజం లేదన్నారు. ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. 'ఈ వార్తల్లో వాస్తవం లేదు. సాధారణ వ్యక్తిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను' అంటూ స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు సోనూసూద్‌ని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. సోనూ తాజా పోస్టులో రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు.