ప్యాన్ ఇండియా.. ఈ మాట ఇప్పుడు వినిపిస్తోంది కానీ.. ఒకప్పుడు మణిరత్నం, శంకర్ వంటి దర్శకులు ఆ మాటకు దేశవ్యాప్తంగా అర్థం చెప్పారు. అద్భుతమైన విజయాలతో అదరగొట్టారు. అయితే అప్పుడు ఒరిజినల్ తర్వాత వేర్వేరు భాషల్లో రిలీజ్ అయ్యేవి. మణిరత్నం ట్రెండ్ కు పూర్తి భిన్నంగా శంకర్ దూసుకువచ్చాడు. తన కథల్లో సందేశాన్ని మిక్స్ చేసి అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. ఫస్ట్ మూవీకే బెస్ట్ అనిపించుకున్న శంకర్ భారతీయుడు మూవీతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. అపరిచితుడు సైతం అదే స్థాయిలో విజయం సాధించింది. రోబో వరకూ అప్రతిహతంగా సాగిన శంకర్ జర్నీ తర్వాత తడబడింది. స్నేహితుడు( త్రీ ఇడియట్స్ రీమేక్)తో మొదలైన ఫ్లాపుల పరంపర కొనసాగుతూనే ఉంది. రోబో 2.0 కొంత వరకూ ఫర్వాలేదనిపించుకున్నా మెయిన థీమ్ విమర్శల పాలైంది. ఇక సిసలైన పతనం అనేలా భారతీయుడు 2 కనిపించింది. భారతీయుడు ఓ క్లాసిక్ అనుకుంటే ఆ క్లాసిక్ ను కంపు చేశాడు సీక్వెల్ తో. ఈ టైమ్ లో ప్యాన్ ఇండియా హీరోగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తో వచ్చిన అవకాశాన్ని సైతం చేజార్చుకున్నాడు. గేమ్ ఛేంజర్ అతని ఇమేజ్ ను పూర్తిగా మార్చేసింది. ఒకప్పటి శంకర్ మాయమైపోయాడు.
ఇక ప్యాన్ ఇండియా స్థాయిలో కాకపోయినా కోలీవుడ్ లో శంకర్ తర్వాత ఆ తరహాలో మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీస్ తో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్. రమణ(తెలుగులో ఠాగూర్), గజిని, స్టాలిన్, 7త్ సెన్స్, తుపాకి, కత్తి వంటి మూవీస్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఆ దూకుడులో తెలుగులో మహేష్ బాబు ఇచ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు. స్పైడర్ అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ మహేష్ కెరీర్ లో ఓ బ్యాడ్ మెమరీ అనిపించుకుంది. అప్పటి నుంచి మళ్లీ తిరిగి లేవలేకపోయాడు మురుగదాస్. విజయ్ తో సర్కార్, రజినీకాంత్ తో చేసిన దర్బార్ తమిళ్ లో యావరేజ్ అనిపించుకుంటే ఇతర భాషల్లో ఫ్లాప్. దర్బార్ తర్వాత మురుగదాస్ కు మరే స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్లి సల్మాన్ ఖాన్ ను ఒప్పించాడు. సికందర్ అంటూ వచ్చిన ఈ మూవీ సల్మాన్ కెరీర్ లో ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళ్ లో శివకార్తికేయన్ తో మదరాసి అనే మూవీ చేస్తున్నాడు. బట్ సికందర్ రిజల్ట్ చూసిన తర్వాత శివకార్తికేయన్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఆశలు వదిలేసుకున్నారు.. అచ్చు భారతీయుడు 2 చూసి గేమ్ ఛేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ లాగా.
మొత్తంగా ఇద్దరూ ఒకప్పుడు కోలీవుడ్ ను శాసించిన దర్శకులు. కంటెంట్ ఉన్నవాళ్లుగా పేరు తెచ్చుకున్నవాళ్లు. తమ కథలతో సామాజిక బాధ్యతలనూ గుర్తు చేశారు. బట్ ఇప్పుడు కమ్ బ్యాక్ కోసం కష్టపడుతున్నారు. కానీ ఇప్పటి ఆడియన్స్ పల్స్ ను పట్టుకోవడంలో ఇద్దరూ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మరి వీరి కమ్ బ్యాక్ ఎప్పుడు ఎలా ఉంటుందో చూడాలి.